తెలంగాణలో దీపావళికి టపాసులపై బ్యాన్, క్రాకర్స్ అమ్మితే కేసులు.. హైకోర్టు కీలక తీర్పు

  • Published By: naveen ,Published On : November 12, 2020 / 03:14 PM IST
తెలంగాణలో దీపావళికి టపాసులపై బ్యాన్, క్రాకర్స్ అమ్మితే కేసులు.. హైకోర్టు కీలక తీర్పు

Updated On : November 12, 2020 / 3:47 PM IST

ban on diwali crackers: తెలంగాణలో దీపావళి పండగకు టపాసులు కాల్చడాన్ని నిషేధిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో దీపావళికి టపాసులు కాల్చితే… శ్వాసకోస సమస్యలతో రోగులు ఇబ్బందులు పడతారంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తెరిచిన షాపులను వెంటనే మూసివేయడంతో పాటు ఎవరైనా క్రాకర్స్‌ అమ్మితే కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. ఇతర రాష్ట్రాల్లో బాణాసంచా అమ్మకాలపై నిషేధం విధిస్తున్నప్పుడు ఇక్కడ అమలు చేయలేమా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. బాణాసంచా అమ్మకాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో నవంబర్ 19లోగా తెలపాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కరోనా వ్యాప్తి సమయంలో దీపావళి టపాసులు, సంబరాలపై ఇప్పటికే పలు రాష్ట్రాలు నిషేధం విధించగా.. తెలంగాణ రాష్ట్రంలోనూ టపాసుల కాల్చడం, విక్రయంపై కీలక నిర్ణయం తీసుకుంది హైకోర్టు. దీపావళిపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా వేళ టపాకాయలు పేల్చడం అవసరమా? అని ప్రశ్నించింది. కరోనా వైరస్ కేసులు పెరగడం, కాలుష్యం తీవ్రత అధికం కావడంతో శ్వాసకోశ ఇబ్బందులు పెరిగే అవకాశం ఉందని హైకోర్టు అంది. ఇప్పటివరకు తెరిచిన క్రాకర్స్ షాపులను వెంటనే మూసేయాలని, తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కరోనా, వాయు కాలుష్యం కారణంగా పలు రాష్ట్రాల్లో టపాసులు కాల్చడం, అమ్మకంపై ఆయా ప్రభుత్వాలు బ్యాన్ విధించాయి. ఢిల్లీ ప్రభుత్వం తొలుత టపాసుల విక్రయాలపై నిషేధం విధించగా.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ సైతం టపాసుల విక్రయాలపై నిషేధం విధించాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో ఉత్తరాదిన 7 రాష్ట్రాలు టపాసుల విక్రయం, వాడకంపై నిషేధం విధించాయి. ఢిల్లీలో నవంబర్ 7 నుంచి నవంబర్ 30వరకు నిషేధం అమల్లో ఉంటుంది. ఎవరైనా ఆదేశాలు ఉల్లంఘిస్తే లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తారు. కాగా, కనీసం గ్రీన్ క్రాకర్స్ అమ్మకాలకు అనుమతించాలని వ్యాపారులు కోరుతున్నారు. బాణాసంచాపై బ్యాన్ తో శివకాశీలోని ఫైర్ వర్క్స్ పరిశ్రమకు తీరని నష్టం వాటిల్లింది. ఫైర్ వర్క్స్ పరిశ్రమపై 8లక్షల మంది కార్మికులు ఆధారపడ్డారు.