Inter Results 2025: ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఆన్సర్ పేపర్ల వాల్యుయేషన్లో కొత్త విధానం.. ఫలితాలు వెల్లడి ఎప్పుడంటే..
తెలంగాణలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు పూర్తికాగా.. వాల్యుయేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, ఈసారి వాల్యుయేషన్ ప్రక్రియలో ఇంటర్ బోర్డు కొత్త విధానాన్ని అమలు చేస్తుంది.

Inter Papers Valuation
Inter Results 2025: తెలంగాణలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు పూర్తికాగా.. వాల్యుయేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, ఈసారి వాల్యుయేషన్ ప్రక్రియలో ఇంటర్ బోర్డు కొత్త విధానాన్ని అమలు చేస్తుంది. ఫలితాల్లో తప్పులు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా కొత్త విధానాన్ని అమలు చేయనుంది.
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు మార్చి3న ప్రారంభంకాగా.. మార్చి 25వ తేదీతో ముగిశాయి. ఈ పరీక్షలకు 9.96లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. 19 కేంద్రాల్లో పరీక్షా పత్రాల వాల్యుయేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈనెల 10వ తేదీతో వాల్యుకేషన్ ప్రక్రియ ముగిసే అవకాశం ఉంది. అయితే, రాష్ట్రంలోని ప్రతియేటా పరీక్ష ఫలితాలు వచ్చిన తరువాత సుమారు 50వేల మంది వరకు స్పెషల్ ఫీజు చెల్లించి రీ వాల్యుయేషన్, రీ కౌంటింగ్ కు దరఖాస్తు చేసుకునేవారు. దీంట్లో చాలా మందికి మార్కులు కూడా యాడ్ అవుతూ వచ్చాయి. ఈసారి అలాంటి పరిస్థితి లేకుండా ఇంటర్ బోర్డు వాల్యుయేషన్ సమయంలో పకడ్బంధీ చర్యలు చేపట్టింది.
ఇంటర్ పరీక్షా పత్రాలను వాల్యుయేషన్ పూర్తయిన తరువాత మళ్లీ చెక్ చేయనున్నారు. విద్యార్థులకు వచ్చిన మార్కుల్లో ఐదు స్లాట్లలో ర్యాండమ్ చెకింగ్ చేయాలని ఇంటర్ బోర్డు అధికారులు నిర్ణయించారు. ప్రధానంగా జీరో మార్కులు, 1 నుంచి పది మార్కులు, 25 నుంచి 35 మార్కులు, 60 నుంచి 70 మార్కులతో పాటు 95 నుంచి 99 మార్కులు వచ్చిన వారివి ఎంపిక చేసి రీ వాల్యుయేషన్ చేస్తారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 19 స్పాట్ కేంద్రాల్లో రీ వాల్యుయేషన్, రీ కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. మూడు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తిచేసి, మరో మూడు రోజులు ర్యాండమ్ ఆన్సర్ షీట్లను రీ వాల్యుయేషన్ చేయించనున్నారు. వీటితోపాటు అన్ని సబ్జెక్టుల్లో మొంచి మార్కులతో పాసై.. ఒక సబ్జెక్టులో ఫెయిలైతే ఆ సబ్జెక్ట్ ఆన్సర్ షీట్లను మరోసారి వాల్యుయేషన్ చేయనున్నారు.
వాల్యుయేషన్ ప్రక్రియలో జరిగే తప్పుల నివారణకే రీ వాల్యుయేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నామని ఇంటర్ బోర్డు పేర్కొంది. ఈ ప్రక్రియ ద్వారా ఫలితాల విడుదల అలస్యమవుతుందని తెలుస్తోంది. ఈనెల 20 నుంచి 25 తేదీల మధ్య ఇంటర్ ప్రథమ, ద్వితీయ ఫలితాలను వెల్లడించాలని ఇంటర్ బోర్డు అధికారులు భావిస్తున్నారు.