బీజేపీలో చేరిన స్వామిగౌడ్…

Swamy Gowd joined BJP : తెలంగాణ శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ బీజేపీలో చేరారు. బుధవారం బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. జేపీ నడ్డా సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవానికి ఇబ్బందిగా ఉందని టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చానని తెలిపారు. తెలంగాణ అభివృద్ధిపై టీఆర్ఎస్ నేతలు అలక్ష్యం వహించారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారులకు కనీస మర్యాద ఇవ్వరా అని ప్రశ్నించారు. ఉద్యమకారులను ఎందుకు పక్కనబెడుతున్నారో అర్థం కావదం లేదన్నారు.
ఏ ఆత్మాభిమానం కోసమైతే తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేశామో ఐదు సంవత్సరాల్లో అవే పరిస్థితులు పునరావృత్తం కావడం బాధకరమన్నారు. ఒక్కనాడైనా జెండా పట్టని, ధర్నా చేయని, తెలంగాణ ఉద్యమం కోసం మాట్లాడనటువంటి ఇతర పార్టీల పెద్దలందరికీ అగ్రతాంబూలం ఇచ్చారని విమర్శించారు. వారికి ప్రధాన పదవులు ఇచ్చి.. ఉద్యమకారులను దూరం పెట్టారని పేర్కొన్నారు. తాను తండ్రిగా భావించే కేసీఆర్ ఈ విషయంలో ఎందుకు అలక్ష్యం ప్రదర్శించారో ఎవ్వరికీ అర్థం కాలేదన్నారు.
తెలంగాణ బిడ్డలం ఉద్రేకంతో ఉద్యమం చేసి ఉండొచ్చు, తమకు తెలివిలేకపోయి ఉండొచ్చు..కానీ కనీస మర్యాద కూడా తెలంగాణ ఉద్యమకారులకు అవసరం లేదా అని ప్రశ్నించారు. తాను తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేసీఆర్ పూర్తిగా ఆమోదిస్తారని అనుకుంటున్నట్లు ప్రకటించారు. రెండు సంవత్సరాల నుంచి కనీసం వందసార్లు అపాయింట్ మెంట్ అడిగి ఉంటానని కానీ ఎప్పుడు దొకరకలేదన్నారు. రెండేళ్ల నుంచి తనతో మాట్లాడేందుకు కేసీఆర్ కు సమయం దొరకలేదన్నారు.
షరతులతో గానీ, ఎలాంటి పదవుల కోసం గానీ బీజేపీలో చేరలేదని..తెలంగాణ ఉద్యమకారుల గౌరవం కోసం మాత్రమే చేరినట్లు స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవానికి ఇబ్బందిగా ఉందని టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చానని తెలిపారు.