Komati Reddy Venkat Reddy : భువనగిరి అంటే.. కాంగ్రెస్ కంచుకోటగా మళ్లీ నిరూపించాలి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
మాకు ఎవరితో పోటీ లేదు.. మాలో మాకే నల్గొండ, భువనగిరికి పోటీ .. నల్గొండలో 5 లక్షల మెజార్టీతో గెలుస్తున్నాం..

Telangana Minister Komati Reddy Venkat Reddy
Komati Reddy Venkat Reddy : భువనగిరి అంటే.. కాంగ్రెస్ కంచుకోట అని మరోసారి నిరూపించాలన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్, బీజేపీలను బొంద పెట్టాలని విమర్శించారు.
Read Also : ఏపీలో మరో 9 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లు ప్రకటన
సీఎం రేవంత్ రెడ్డి.. హైటెన్షన్ వైర్ అయితే.. రాజగోపాల్ రెడ్డి ట్రాన్స్‌ఫార్మర్ అని.. తమను ముట్టుకొంటే మీకే నష్టమన్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని చెప్పారు. మాకు ఎవరితో పోటీ లేదు.. మాలో మాకే నల్గొండ, భువనగిరికి పోటీ .. నల్గొండలో 5 లక్షల మెజార్టీతో గెలుస్తున్నాం.. మీరు 4 లక్షల మెజార్టీ తగ్గవద్దంటూ మంత్రి కోమటిరెడ్డి అక్కడి ప్రజలకు పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యేలు, ఎంపీ అందరం కొట్లాడి భువనగిరిని అభివృద్ధి చేసుకుందామన్నారు. అక్కలు, చెల్లెలు ఆర్టీసీ బస్సులో టికెట్ తీసుకుంటున్నారా? జీరో కరెంట్ బిల్లు వచ్చిందా లేదా ? ఫార్మ్ హౌజ్ లో పడుకున్న కేసీఆర్‌కు వినపడేలా గట్టిగా చెప్పండని అన్నారు. కేసీఆర్ ఎన్నడైనా భువనగిరి గురించి పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. భువనగిరి పోర్ట్‌కు రోప్‌వే ఇవ్వమంటే కిషన్ రెడ్డి స్పందించలేదని మండిపడ్డారు.
‘బిడ్డా కేసీఆర్.. నీకు పదేళ్లు టైం ఇచ్చినం.. ఇవాళ ప్రభుత్వం పడిపోతుందని ఎలా మాట్లాడుతావు? మా ఎమ్మెల్యేలు, ఎవరైనా ఎప్పుడంటే అప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని ఇంటికి వెళ్లి కలిసి వస్తున్నాం. గతంలో ఎన్నడైనా ఎమ్మెల్యేలు సీఎంను కలిసారా? ప్రగతి భవన్ లో కలిసి తిన్నారా? ’ అని సూటిగా ప్రశ్నించారు. 24 రోజులు కార్యకర్తలు అవిశ్రాంతంగా పనిచేసి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకుందామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు.