ఏప్రిల్ 14న దీక్షకు దిగనున్న తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్

రాష్ట్రానికి బీజేపీ చేసిందేంటని పొన్నం ప్రభాకర్ చెప్పారు. కొత్త రాష్ట్రానికి పదేండ్లలో బీజేపీ ఇచ్చిందేంటని ప్రశ్నించారు.

ఏప్రిల్ 14న దీక్షకు దిగనున్న తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్

Minister Ponnam Prabhakar

Updated On : April 12, 2024 / 2:39 PM IST

కరీంనగర్‌లోని కాంగ్రెస్ కార్యాలయంలో తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ దీక్షకు దిగనున్నారు. ఇవాళ హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… బీజేపీ, బీఆర్ఎస్ వైఫల్యాలపై ఏప్రిల్ 14న దీక్ష చేపడతానని తెలిపారు.

నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎవరెవరికి ఇచ్చారో వారినే బీఆర్ఎస్ ఓట్లు అడగాలని అన్నారు. తమవైపు ఒక్క వేలు చూపెడితే, తాము నాలుగు వేళ్లు చూపెడతామని చెప్పారు. తెలంగాణ ఏర్పడడంపై మోదీ అవహేళన చేశారని అన్నారు. రాష్ట్రంలో ఓట్లు అడగడానికి మోదీకి ఏం హక్కు ఉందని నిలదీశారు.

రాష్ట్రానికి బీజేపీ చేసిందేంటని పొన్నం ప్రభాకర్ చెప్పారు. కొత్త రాష్ట్రానికి పదేండ్లలో బీజేపీ ఇచ్చిందేంటని ప్రశ్నించారు. అదానీ అంబానీకి దేశ సంపదను అమ్మడం తప్ప మోదీ ఏం చేశారని అన్నారు.

బీజేపీని వ్యతిరేకించిన వారిని ఈడీ, సీబీఐతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. అభివృద్ధి గురించి మాట్లాడకుండా గాలి కబుర్లు చెబుతున్నారని అన్నారు. శ్రీరాముడిని రాజకీయాల కోసం వాడుకోవడం తప్పని హితవు పలికారు. సికింద్రాబాద్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏం చేశారని నిలదీశారు.

Also Read: అసలు ఇక్కడ ఏమి జరుగుతోందో అర్థం కావట్లేదు: బాలినేని శ్రీనివాసరెడ్డి