Telangana Covid 19 : తెలంగాణపై కరోనా పంజా… ఈ ఏడాదిలోనే అత్యధిక కేసులు నమోదు
తెలంగాణలో కరోనా విజృంభణ ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో ఈ ఏడాదిలోనే అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న(మార్చి 23,2021) రాత్రి 8 గంటల వరకు 70వేల 280 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా..

Telangana Covid 19 Cases : తెలంగాణలో కరోనా విజృంభణ ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో ఈ ఏడాదిలోనే అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న(మార్చి 23,2021) రాత్రి 8 గంటల వరకు 70వేల 280 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 431 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 3,04,298కి చేరింది.
నిన్న కొవిడ్‌తో ఇద్దరు మృతిచెందారు. ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 1,676కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 228 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 2,99,270కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,352 ఉండగా.. వీరిలో 1,395 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 111 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 97,89,113కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బుధవారం(మార్చి 24,2021) ఉదయం బులిటెన్ విడుదల చేసింది.
కొవిడ్ వ్యాక్సినేషన్‌లో భాగంగా తెలంగాణలో ఇప్పటివరకు 7,86,426 మందికి డోస్ 1.. 2,24,374 మందికి డోస్ 2 టీకా వేసినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే డోస్ 1ను 39వేల 119 మందికి, డోస్ 2ను 3వేల 611 మందికి వేశారు.
ఏపీలో కరోనా డేంజర్ బెల్స్.. ఒక్కరోజే 492 కొత్త కేసులు
ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా వైరస్ మహమ్మారి మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గత కొన్ని నెలలతో పోలిస్తే మంగళవారం(మార్చి 23,2021) అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా గడిచిన 24 గంటల వ్యవధిలో 492 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధరణ అయ్యాయి. ఒక్క రోజు వ్యవధిలో 33వేల 634 శాంపిల్స్ పరీక్షించగా 492 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య 8లక్షల 94వేల 536కి చేరింది.
అలాగే గడిచిన 24 గంటల్లో కరోనాతో చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కోవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 7వేల 193కి చేరింది.
ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 168 కేసులు:
గడిచిన 24 గంటల్లో 256 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 2వేల 616 యాక్టివ్ కేసులున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా మంగళవారం ఒక్కరోజే 168 మందికి పాజిటివ్‌గా తేలడం కలకలం రేపుతోంది. రాజమండ్రిలోని ఓ కాలేజీలో 163 మంది విద్యార్థులకు కరోనా సోకిన విషయం తెలిసిందే.
భారీగా పెరిగిన కొత్త కేసులు, మరణాలు, యాక్టివ్ కేసులు: భారత్‌లో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. సెకండ్ వేవ్ తీవ్రత మామూలుగా లేదు. రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదయ్యాయి. ఒక్కరోజే 47వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూడటం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 10.25లక్షల పరీక్షలు చేయగా.. 47వేల 262 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దరణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య కోటి 17లక్షల 34వేల 058కి చేరింది. ఈ ఏడాదిలో ఒక్కరోజే నమోదైన కేసుల్లో అత్యధికం ఇదే. 2020 నవంబర్ లో ఒక్కరోజే 47వేల కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత అంతకుమించి కేసులు వెలుగుచూడటం ఇదే.
కరోనా తీవ్రత కలవరపెడుతోంది. కొత్తగా నమోదవుతున్న కేసులతో పాటు యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్యలోనూ భారీగా పెరుగుదల కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. క్రితం రోజుతో పోలిస్తే మంగళవారం(మార్చి 23,2021) కరోనా మరణాలు రికార్డు స్థాయిలో 275 నమోదయ్యాయి.
అంతకుముందు రోజు 199 కరోనా మరణాలు నమోదు కాగా.. మంగళవారం(మార్చి 23,2021) రికార్డు స్థాయిలో 275 మంది మరణించారు. దీంతో మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య లక్షా 60వేల 441కి చేరింది. మరణాల రేటు 1.37 శాతానికి చేరింది. కొత్తగా 23వేల 907 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య కోటి 12లక్షల 05వేల 160కు చేరి.. రికవరీ రేటు 95.67శాతానికి తగ్గింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 3,68,457 కి పెరిగింది.
దేశంలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ సాగుతోంది. గడిచిన 24గంటల్లో 23.46లక్షల మందికి టీకా వేశారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం వ్యాక్సిన్ అందిన వారి సంఖ్య 5,08,41,286కి చేరింది.
మహారాష్ట్రలో 132 మంది కరోనాకు బలి:
దేశంలో మహారాష్ట్రలోనే కరోనా ప్రభావం అత్యధికంగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో అక్కడ 28వేలకు పైగా(28వేల 699) కేసులు నమోదయ్యాయి. మరోవైపు 132 మంది కరోనాకు బలయ్యారు. నిన్న 13వేల 165 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
మహారాష్ట్ర, పంజాబ్, కర్నాటక, గుజరాత్, ఛత్తీస్ ఘడ్, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో ఈ ఆరు రాష్ట్రాల నుంచే ఎక్కువగా ఉన్నాయి. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో 80.90శాతం కేసులు ఈ రాష్ట్రాల నుంచే ఉండటం గమనార్హం.