తెలంగాణ సచివాలయం : చిన్న చిన్న మార్పులు, జైపూర్ నుంచి రాళ్లు

Telangana Secretariat : తెలంగాణ నూతన సచివాలయాన్ని అత్యంత ఆధునిక హంగులతో నిర్మించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో డిజైన్ బయట, లోపల అంతర్గతంగా చిన్నచిన్న మార్పులు జరిగాయి. దేశంలోని పలుప్రాంతాల నుంచి రకరకాల రాయిని తెప్పించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. అత్యున్నత కట్టడాల నిర్మాణశైలి పరిశీలనకు ఒక బృందాన్ని పంపించాలని కూడా సర్కార్ భావిస్తోంది. ఏడు అంతస్తుల్లో నిర్మాణం కానున్న తెలంగాణ నయా సచివాలయం భవనం బయట కొన్ని మార్పులు సూచిస్తూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. నిర్మాణ పనులు శరవేగంగా జరగాలని నిర్మాణ సంస్థను ఆదేశించింది. తెలంగాణ ఇమేజ్‌ను ప్రతిబింబించేలా రూపుదిద్దుకోనున్న సచివాలయం నిర్మాణ పనులను ఇప్పటికే సీఎం కేసీఆర్…క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఆర్ అండ్ బీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి తరచూ వస్తూ పనులు పరిశీలిస్తున్నారు.
తెలంగాణ కీర్తిప్రతిష్టలు ప్రతిబింబించేలా.. అత్యద్భుత రీతిలో ఉన్న డిజైన్లను పరిశీలించి తుది మెరుగులు దిద్ది కొన్ని నెలల క్రితం ఫైనల్ డిజైన్‌ను ఆమోదించింది ప్రభుత్వం. 500 కోట్ల రూపాయలతో నిర్మాణం కానున్న నూతన సచివాలయం ముందు హెలిప్యాడ్, రెండువైపులా లాన్లు, వాహనాలకు పార్కింగ్‌లలో మార్పులకు అప్పట్లోనే సూచనలు చేస్తూ తుది డిజైన్ ఖరారు చేసింది. హైకోర్టులో కేసులన్నీ తొలగిపోయేసరికి గతేడాది జులై 7 తర్వాత పాత సచివాలయాన్ని కూల్చివేసి….కొన్ని రోజుల్లోనే కొత్త సచివాలయాలనికి పునాదులు తీశారు. ఇప్పుడీ సచివాలయం నిర్మాణంపై మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. భవనాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా రూపొందించేందుకు పలుప్రాంతాల నుంచి పెద్ద పెద్ద రాళ్లను తెప్పించాలని డిసైడైంది. జైపూర్ నుంచి రాళ్లు తెప్పించి భవన నిర్మాణంలో వినియోగించనున్నారు.
ఢిల్లీలో పార్లమెంట్ భవనం సెంట్రల్ విస్టాకు కట్టే రాయిని పరిశీలించాలని…మంత్రి, అధికారులకు సీఎం కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే మంత్రులు, అధికారుల బృందం ఢిల్లీ వెళ్లనుంది. వచ్చే నెలాఖరుకు ఆ బృందం పలు నగరాల్లోని అత్యున్నత కట్టడాలను పరిశీలించనుంది. పలు దేశాల్లోని ప్రముఖ కట్టడాలని పరిశీలించనున్నట్లు సమాచారం. అలా నగరాలు, విదేశాల్లో పర్యటించిన బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా సచివాలయం నిర్మాణలో మరిన్ని మార్పులకు సూచనలు చేసే అవకాశం ఉంది.