కరోనా కలకలం.. తెలంగాణ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసిన యువకుడి అజాగ్రత్త

ఒక యువకుడి అజాగ్రత్త ఇప్పుడు తెలంగాణను ఉలిక్కిపడేలా చేసింది. అటు ప్రభుత్వాన్ని, ఇటు ప్రజలను వణికిస్తోంది. కరోనా సోకిన ఆ యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్… బయట తిరగడం అందరినీ కలవరానికి గురిచేస్తోంది. టెస్ట్‌లో కరోనా పాజిటివ్ అని తేలడంతో గాంధీలో చికిత్స తీసుకుంటున్నాడు. ఇక ఇన్ని రోజులు అతడు కలిసిన వ్యక్తుల చిట్టాతీసి వారికి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఎక్కడెక్కడ తిరిగాడో, ఎవరెవరితో ఉన్నాడో:
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా.. తెలంగాణపైనా అటాక్ చేసింది. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో ప్రజలందరిలో భయాందోళన మొదలైంది. కరోనా సోకిన వ్యక్తి.. అసలు ఎక్కడెక్కడ తిరిగి ఉంటాడనే భయం అందరినీ కలవరపెడుతోంది.(హైదరాబాద్‌లో తిరుగుతున్నారా, బీ కేర్‌ఫుల్, ప్రాణాలకే ప్రమాదం)
బెంగళూరులో కంపెనీలో సహచరులతో కలిసి పని చేశాడు:
హైదరాబాద్ మహేంద్రహిల్స్‌కు చెందిన 24ఏళ్ల యువకుడు ఫిబ్రవరి 17న దుబాయ్ వెళ్లాడు. అక్కడ నాలుగు రోజులపాటు తన ఉద్యోగరీత్యా హాంకాంగ్ వ్యక్తులతో కలిసి పనిచేశాడు. ఆ తర్వాత బెంగళూరు చేరుకుని.. తాను పనిచేస్తోన్న ఎంఎన్‌సీ కంపెనీలో రిపోర్ట్ చేశాడు. అక్కడ అతనికి కరోనా లక్షణాలు కనిపించ లేదు. దీంతో చాలా మందితో కలిసి పనిచేశాడు. కరోనా లక్షణాలు బయటపడటానికి 14 రోజుల సమయం పడుతుండడంతో.. ఇప్పుడు అతనిలో కోవిడ్ సింపటమ్స్ బయటపడ్డాయి. దీంతో అందరిలోనూ ఆందోళన మొదలైంది.
ఆ బస్సులో ప్రయాణించిన 27మందికి పరీక్షలు:
ఫిబ్రవరి 22వ తేదీన బెంగుళూరు నుంచి ఆ యువకుడు హైదరాబాద్‌కు బస్‌లో ప్రయాణం చేశాడు. అతడు ప్రయాణించి బస్సులో 27మంది ప్రయాణీకులు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ 27మంది లిస్ట్ ఇప్పటికే సేకరించి వారిని పరీక్షించేందుకు సిద్ధమైంది. ఇవాళ(మార్చి 03,2020) వారిని గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చే అవకాశముంది.
యువకుడి కుటుంబసభ్యులకు కూడా పరీక్షలు:
కరోనా లక్షణాలున్న యువకుడి కుటుంబం ఉమ్మడి కుటుంబమని.. ఆ కుటుంబ సభ్యులకూ కరోనా సోకే ప్రమాదముంది. దీంతో వారందరినీ పరీక్షించేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. మరోవైపు ఫిబ్రవరి 22న హైదరాబాద్ వచ్చిన ఆ యువకుడు.. ఇప్పటి వరకు ఏదో ఓ పనిమీద బయటకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో అతడు ఎంతమందిని కలిశాడు.. ఎవరెవరినీ కలిశాడన్నదానిపైనా ప్రభుత్వం ఆరా తీస్తోంది.
అపోలో డాక్టర్లు, సిబ్బందికి కూడా పరీక్షలు:
ఫిబ్రవరి 22 తర్వాత ఆ యువకుడు అనారోగ్యానికి గురవ్వడంతో సికింద్రాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరాడు. ఆ సయమంలో కరోనా పాజిటివ్ అని తెలియక అతడితో వైద్యులు, నర్సింగ్ సిబ్బందితో మాట్లాడి ఉంటాడని.. ఇప్పుడు వారందరికి కూడా కరోనా పరీక్షలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫిబ్రవరి 22 నుంచి నిన్న(మార్చి 2,2020) వరకు అతడు 80మందికిపైగా కలిశాడని.. వారందరి చిట్టా తీయడానికి అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ యువకుడు గాంధీ ఆస్పత్రిలో చేరిన సమయంలోనూ ఐసోలేషన్ వార్డు సిబ్బంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారనేది ఇప్పుడు మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
గాంధీ ఆసుపత్రిలో భయం..భయం:
ప్రస్తుతం యువకుడికి గాంధీ ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. అక్కడే స్వైన్‌ఫ్లూ వార్డు కూడా ఉంది. నిత్యం పదుల సంఖ్యలో పేషెంట్స్, వారి సహాయకులు కూర్చొని ఉంటారు. వార్డులో పనిచేసే సిబ్బంది, వైద్యులు జాగ్రత్తలు తీసుకున్నా.. బయట ఉండే వ్యక్తుల పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. మొత్తానికి యువకుడికి కరోనా పాజిటివ్ అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.