Local Body Elections : జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. తొలి విడతలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం. ఈ పత్రాలు తప్పనిసరి.. ఎంత డిపాజిట్ చేయాలంటే..
Local Body Elections మొదటి దశలో భాగంగా 31 జిల్లాల్లోని 58 రెవెన్యూ డివిజన్ల పరిధిలో 2,963 ఎంపీటీసీ, 292 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Local Body Elections
Local Body Elections : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 565 జడ్పీటీసీలు, 5,749 ఎంపీటీసీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు తేదీలను ప్రకటించింది. తాజాగా.. తొలి విడత ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది. దీంతో నేటి నుంచి తొలి విడత ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.
మొదటి దశలో భాగంగా 31 జిల్లాల్లోని 58 రెవెన్యూ డివిజన్ల పరిధిలో 2,963 ఎంపీటీసీ, 292 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా స్థానాల్లో నేటి నుంచి ఈనెల 11వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అక్టోబర్ 12న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 15న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. అక్టోబర్ 23వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 11న కౌంటింగ్, ఫలితాల వెల్లడి ఉంటుంది.
రెండో విడతలో భాగంగా 2,786 ఎంపీటీసీ, 273 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. అక్టోబర్ 13న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను మొదలు పెట్టి.. ఈ నెల 15వ తేదీన ముగిస్తారు. అక్టోబర్ 16వ తేదీన నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 19వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. అక్టోబర్ 27న పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 11వ తేదీన రెండు విడతలకు సంబంధి ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడిస్తారు.
ఇదిలాఉంటే.. నామినేషన్‌లు వేసే అభ్యర్థులు జెడ్పీటీసీ స్థానంకు జనరల్ అభ్యర్థి రూ. 5,000, రిజర్వేషన్ అభ్యర్థి రూ. 2,500. అదేవిధంగా.. ఎంపీటీసీ స్థానంకు నామినేషన్ దాఖలు చేసే జనరల్ అభ్యర్థి రూ.2,500, రిజర్వేషన్ అభ్యర్థి రూ.1,250 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. జడ్పీటీసీలకు జిల్లా పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. ఎంపీటీసీల కోసం మండల కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లు వేయాలంటే ఈ పత్రాలు తప్పనిసరి..
♦ నామినేషన్ పత్రం: అధికారిక ఫామ్‌ను అభ్యర్థి లేదా వారిని ప్రతిపాదించిన వారు స్వయంగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి.
♦ అఫిడవిట్ (ఫారమ్ 26): అభ్యర్థులు తమ నేరచరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలకు సంబంధించి.. ఇద్దరు సాక్షులు ధ్రువీకరించిన స్వీయ ప్రకటన(అఫిడవిట్)ను సమర్పించాలి.
♦ ఓటర్‌లిస్ట్ ధృవీకరణ: అభ్యర్థి ఒకే పట్టణ స్థానిక సంస్థలోని వేరే వార్డులో ఓటరు అయితే.. ఎలక్టోర్ రోల్ ఎక్స్‌ట్రాక్షన్ అవసరం అవుతుంది.
♦ ఫొటోలు : అభ్యర్థులు ఇటీవలి కాలంలో దిగిన కొన్ని పాస్‌పోర్ట్-సైజు ఫోటోలను సమర్పించాలి.
♦ సెక్యూరిటీ డిపాజిట్: నామినేషన్ పత్రం దాఖలు చేసే సమయంలో సూచించిన మొత్తాన్ని డిపాజిట్ చేయాలి.
♦ కుల ధృవీకరణ పత్రం: రిజర్వు చేయబడిన వార్డు నుంచి అభ్యర్థి ఎన్నికలో పోటీ చేస్తున్నట్లు అయితే.. షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), వెనుకబడిన తరగతులు (BC)కి సంబంధించిన కుల ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి.
♦ ఎన్నికల ఖర్చుకు సంబంధించిన డిక్లరేషన్: ఎన్నికల ఖర్చులను నిర్వహించడానికి, ఆ వివరాలు సమర్పించడానికి ఒక డిక్లరేషన్ సమర్పించాలి.
♦ ఫామ్‌లు A, B: రాజకీయ పార్టీలు ప్రతిపాదించిన అభ్యర్థులకు వర్తిస్తుంది.
♦ వయస్సు ధ్రువీకరణ పత్రం: వయసు ధ్రువీకరణ కోసం జనన ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు లేదా పాఠశాల సర్టిఫికెట్లు వంటి పత్రాలు అవసరం అవుతాయి.