Kothagudem: ఖాకీ పోస్టింగ్.. ఖద్దర్ ఫైటింగ్.. పుణ్యక్షేత్రం సాక్షిగా పైరవీల ఫైట్ నడుస్తోందా?

ఆ పైరవీలు ఇప్పుడు భద్రాచలంలో ఇద్దరునేతల మధ్య పంతాన్ని రాజేశాయి.

Kothagudem: ఖాకీ పోస్టింగ్.. ఖద్దర్ ఫైటింగ్.. పుణ్యక్షేత్రం సాక్షిగా పైరవీల ఫైట్ నడుస్తోందా?

Updated On : January 23, 2025 / 9:48 PM IST

పుణ్యక్షేత్రం సాక్షిగా పైరవీల ఫైట్ నడుస్తుందా? ఆ ఇద్దరు నేతల మధ్య బదిలీల పంతం సాగుతుందా.? ఓ నేత ఒకరికి సీఐ పోస్టింగ్ ఇప్పిస్తే.. మరో నేత అక్కడి నుంచి బదిలీ వ్యూహం రచిస్తున్నారా? అసలు భద్రాద్రి రామయ్య సన్నిధిలో జరుగుతున్న రాజకీయం ఏంటి? ఆ పోస్టింగ్‌ల పంచాయితీ ఏంటి?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కీలకమైన ప్రాంతం భద్రాచలం నియోజకవర్గం. ఏజెన్సీ ప్రాంతంతో పాటు దక్షిణ అయోధ్యగా పిలువబడే ప్రాంతమిది. ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో పోలీస్ పోస్టింగ్ ఉంటే రాజకీయ, అధికారులతో పరిచయాలు పెరుగుతాయి. దర్శనాలు చేయించి అధికారులను మచ్చిక చేసుకోవచ్చు. అక్కడ పోస్టింగ్ వస్తే చాలు.. ఉమ్మడి రాష్ర్టంలో ఎక్కడైనా కావాల్సిన పనులు చేయించుకోవచ్చు. అలాంటి పోస్టింగ్ కోసం పైరవీలు భారీగా సాగుతాయి.

మొన్నటి ఎన్నికల్లో వీరయ్య ఓటమి
అయితే ఆ పైరవీలు ఇప్పుడు భద్రాచలంలో ఇద్దరునేతల మధ్య పంతాన్ని రాజేశాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పొదెం వీరయ్య ఓటమి పాలైయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన డాక్టర్ తెల్లం వెంకట్రావు కొద్దిరోజులకే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అప్పటి వరకు పోదెం వీరయ్య వర్సెస్ తెల్లం వెంకట్రావుగా ఉండే రాజకీయాలు ఒక్కసారిగా.. ఒకే పార్టీలో రెండు వర్గాలుగా మారిపోయాయి. పొదెం వీరయ్యకు భట్టి విక్రమార్క అండదండలు ఉన్నాయి. కార్పొరేషన్ పదవి కూడా తెచ్చుకున్నారు. తెల్లం వెంకట్రావుకు మంత్రి పొంగులేని శ్రీనివాస్‌తో మంచి సాన్నిహిత్యం ఉంది.

అయితే వీళ్లద్దరి మధ్య ఉన్న పంతానికి భద్రాచలం టౌన్ పోలీస్‌ స్టేషన్‌ పోస్టింగ్‌లే కొలమానంగా మారిపోయాయి. గత ప్రభుత్వంలో భద్రాచలం పోస్టింగ్ కోసం ఆర్ వెంకటేశ్వర్లు ప్రయత్నించి విఫలమయ్యారు. కొత్త ప్రభుత్వం రాగానే ఎట్టకేలకు భద్రాచలం పోస్టింగ్ తెచ్చుకున్నాడు. అయితే ఆయన బాధ్యతలు చేపట్టి నెల రోజులు కాకముందే ఆర్ వెంకటేశ్వర్లకు బదిలీ ఆర్డర్ వచ్చేసింది. ఈయన బదిలీ వెనుక పొదెం వీరయ్య హస్తం ఉందని లోకల్ టాక్. సంజీవ రావు అనే పోలీస్ ఆఫీసర్ కోసమే.. వెంకటేశ్వర్లను బదిలీ చేయించారని ప్రచారం జరిగింది. సీఐ సంజీవరావు వచ్చి ఏడాది కూడా కాలేదు. ఈయనకు కూడా బదిలీ ఉత్తర్వులు రానే వచ్చేశాయి. దీని వెనుక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వ్యూహం ఉందనే గాసిప్ బలంగా వినిపిస్తోంది.

బదిలీ కోసం రిక్వెస్ట్
సీఐ సంజీవరావు ప్లేస్‌లో బరపాటి రమేశ్‌ అనే పోలీస్ ఆఫీసర్‌ను తీసుకుని వచ్చారని లోకల్‌ గాసిప్. ములుగుకు చెందిన రమేశ్‌కు పొదెం వీరయ్య ప్రత్యర్థి అయిన సీతక్క అండదండలు ఉన్నాయన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. బదిలీ లెటర్ రాగానే రమేశ్‌ హుటాహుటానా భద్రాచలంలో పీఎస్‌లో రిపోర్ట్ చేశారట. అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది. పాత సీఐ సంజీవరావు బదిలీ అవ్వడానికి ఇష్టపడటం లేదట. తాను వచ్చి కనీసం ఏడాది కూడా కాలేదని అప్పుడే బదిలీ ఎలా చేస్తారంటూ స్వరం వినిపిస్తున్నాడట. ఎలాగైనా తన బదిలీ అప్పించాలంటూ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్యను రిక్వెస్ట్ చేస్తున్నారట.

దీంతో కోపంతో ఊగిపోయిన పొదెం వీరయ్య.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకి ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. తాను తీసుకొచ్చిన వ్యక్తిని ఎలా బదిలీ చేస్తారంటూ నిలదీస్తున్నారట. ఇది ముమ్మాటికి తనకే అవమానమే అంటూ అసంతృప్తి వెళ్లగక్కారట. ఇటు ఎమ్మెల్యే తెల్లం సైతం సీఐ పోస్టు పంచాయితీని మంత్రి పొంగులేటి దగ్గరకు తీసుకువెళ్లారట. మొత్తానికి భద్రాచలం టౌన్ సీఐ పోస్ట్ పంచాయితీ మంత్రుల ముందుకు వెళ్లింది. ఇక్కడ రమేశ్ సీఐగా వస్తే తెల్లం పంతం నెగ్గినట్టు.. సంజీవరావును సీఐగా కొనసాగిస్తే.. పొదెం వీరయ్యకు మాట నిలబడినట్టు.. మరి రాయయ్య ఊరిలో చెలరేగిన ఈ పోస్టింగ్ పంచాయితీని మంత్రులు ఎలా డీల్ చేస్తారో చూడాలి.

Danam Nagender : ముందు పాతబస్తీ నుంచి మొదలు పెట్టాలి- హైడ్రా కూల్చివేతలపై మరోసారి దానం నాగేందర్ సీరియస్