కవ్వాల్ టైగర్ రిజర్వ్ ప్రాంతం వద్ద ఉద్రిక్తత.. ఆదివాసీలు కారంపొడి, కర్రలతో దాడి చేశారని పోలీసులకు ఫారెస్ట్ సిబ్బంది ఫిర్యాదు
అక్కడికి వెళ్లిన తమపై కారంపొడి, కర్రలతో దాడి చేశారని ఇంధన్ పల్లి రేంజ్ ఫారెస్ట్ సిబ్బంది ఆరోపిస్తున్నారు.

మంచిర్యాల జిల్లా కవ్వాల్ టైగర్ రిజర్వ్ లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కంపార్ట్మెంట్ 249 సోనాపూర్ తండా సమీపంలోకి కర్రలు, కారం పొడితో ఆదివాసీలు వచ్చారు. సిర్పూర్-యూ, జైనూర్ మండలాలకు సంబంధించిన 35 మంది ఆదివాసీలు కంపార్ట్మెంట్ లో గుడిసెలు వేశారు.
ఫారెస్ట్ సిబ్బంది గుడిసెలను తొలగించే క్రమంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. అక్కడికి వెళ్లిన తమపై కారంపొడి, కర్రలతో దాడి చేశారని ఇంధన్ పల్లి రేంజ్ ఫారెస్ట్ సిబ్బంది ఆరోపిస్తున్నారు. సిడాం మోతిరాం నాయకత్వంలో దాడి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడిలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రాజేందర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంతోష్ గాయపడ్డట్టు అధికారులు చెబుతున్నారు.
ఇంధన్ పల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీధర్ చారి లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిడాం మోతీరంతో పాటు మొత్తం 35 మందిపై 163/2025 కింద కేసు నమోదు చేసిన జన్నారం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.