Test Tube Baby Centre: దారుణం.. భర్త వీర్యంతో కాకుండా మరొకరి వీర్యంతో సంతానం.. క్యాన్సర్‌తో బయటపడ్డ టెస్ట్ ట్యూబ్ సెంటర్ మోసం..

టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహాకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దంపతుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పైన కేసు నమోదు చేశారు.

Test Tube Baby Centre: దారుణం.. భర్త వీర్యంతో కాకుండా మరొకరి వీర్యంతో సంతానం.. క్యాన్సర్‌తో బయటపడ్డ టెస్ట్ ట్యూబ్ సెంటర్ మోసం..

Updated On : July 26, 2025 / 9:19 PM IST

Test Tube Baby Centre: సికింద్రాబాద్ లో టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ లో భారీగా వీర్యం నిల్వలు గుర్తించారు. భర్త వీర్య కణాలతో కాకుండా మరొకరి స్పెర్మ్ ఉపయోగించి సంతానం కలిగేలా చేశారని ఓ మహిళ ఫిర్యాదు చేశారు. కొన్ని నెలల క్రితం టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం వచ్చిన దంపతులకు మగ బిడ్డ జన్మించాడు. చిన్నారి ఎదుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలు వచ్చాయి.

కొన్ని రోజుల క్రితమే చిన్నారికి క్యాన్సర్ నిర్ధారణ అయ్యింది. అనుమానంతో దంపతులు డీఎన్ ఏ టెస్ట్ చేయించారు. డీఎన్ఏ మరొకరిదని తేలడంతో షాక్ తిన్నారు. వెంటనే దంపతులు పోలీసులను ఆశ్రయించారు. టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహాకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దంపతుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పైన కేసు నమోదు చేశారు.

9 నెలల క్రితం అధికారులు టెస్ట్ ట్యూబ్ బేటీ సెంటర్ ను సీజ్ చేశారు. కానీ, అక్రమంగా అనుమతులు తీసుకుని మళ్లీ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో 2 గంటల పాటు తనిఖీలు చేపట్టిన పోలీసులు.. భారీగా వీర్యం నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. కొందరు యువకులకు డబ్బు ఆశ చూపించి స్పెర్మ్ సేకరించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసుని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. హైదరాబాద్ ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో విశాఖలోని సృష్టి సెంటర్ లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ మేనేజర్ ను విశాఖలో అదుపులోకి తీసుకున్నారు. గోపాలపురం పోలీసులకు వచ్చిన పిర్యాదు మేరకు విశాఖలోని సృష్టి టెస్ట్ సెంటర్ మేనేజర్ కళ్యాణిని విచారించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Also Read: గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ సమస్యలు రావడం ఖాయం.. ముందే తెలుసుకోండి

చాలా పెద్ద నెట్ వర్క్, పెద్ద ఎత్తున అక్రమాలు.. పోలీసుల దర్యాఫ్తులో సంచలన విషయాలు..
”గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పై నమోదైన కేసులో దర్యాప్తు చేస్తే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమంగా సరోగసిలా ట్రీట్ చేస్తున్నారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కు ఇతర క్లినిక్ లతో కూడా సంబంధాలు ఉన్నాయి. టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ను సీజ్ చేసే అంశంపై ఇతర శాఖ అధికారులతో చర్చిస్తున్నాం. చాలా పెద్ద నెట్ వర్క్ ఆపరేట్ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలతో కూడా ముడిపడి ఉంది. రెవెన్యూ, వైద్య శాఖల అధికారులతో కలిసి తనిఖీలు చేశాం. రేపు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తాం. పెద్ద ఎత్తున అక్రమాలు గుర్తించాం” అని నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమల్ తెలిపారు.