తెలంగాణలో మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ.. ఆ ఒక్క సీటు కోసం ఒకే పార్టీలో పదిమందికి పైగా ఆశలు

ఉన్నది ఒక్క ఎమ్మెల్సీ స్థానం అయితే.. పోటీపడుతోంది పది మందికి పైగా ఉండడంతో.. బీఆర్ఎస్ అధిష్టానం ఏంచేయాలో తెలియని పరిస్థితుల్లో ఉందట.

తెలంగాణలో మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ.. ఆ ఒక్క సీటు కోసం ఒకే పార్టీలో పదిమందికి పైగా ఆశలు

KCR

Updated On : February 26, 2025 / 8:21 PM IST

ఉన్నదేమో ఒక్క పదవి.. ఆశిస్తున్నదేమో పది మంది. ఏ ఒక్కరికి ఇచ్చినా.. మిగతావాళ్లంతా అసంతృప్తితో రగిలిపోవడం ఖాయం. మరి ఇప్పుడేం చేయాలి.. ముందున్న మార్గం ఏంటి.. ఇదే ఇప్పుడు కారు పార్టీని కంగారు పెడుతున్న విషయం. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు.. పార్టీలో హీట్ పుట్టిస్తోంది. బలం ఆధారంగా.. పార్టీకి ఒక్క ఎమ్మెల్సీ స్థానం దక్కబోతుండగా.. సిట్టింగ్‌లతో పాటు చాలామంది నేతలు ఆశలు పెంచేసుకుంటున్నారు. ఇంతకీ ఎవరా నేతలు.. పోటీ ఎవరి నుంచి..

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. తెలంగాణలో మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతుండగా.. ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. పార్టీలు బలాలు లెక్కలోకి తీసుకుంటే.. అధికార కాంగ్రెస్‌కు నాలుగు ఎమ్మెల్సీలు దక్కనుండగా.. బీఆర్ఎస్‌ ఖాతాలో ఒక స్థానం చేరనుంది.

ఐతే ఎమ్మెల్సీ స్థానం కోసం బీఆర్ఎస్‌లో భారీగా పోటీ కనిపిస్తోంది. ఒక్క సీటు కోసం పదిమందికి పైగా నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఎవరికి వారు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టేశారని టాక్. ఐతే ఈ పోటీ పార్టీలో ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందనే భయం కనిపిస్తోంది.

మరో అవకాశం కల్పించాలని..
ప్రస్తుతం బీఆర్ఎస్‌ నుంచి సత్యవతి రాథోడ్‌, మహమూద్ ఆలి, శేరి సుభాష్ రెడ్డి, యెగ్గె మల్లేశం పదవీకాలం ముగియనుండగా.. తమకు మరో అవకాశం కల్పించాలని వాళ్లంతా.. కేసీఆర్‌ను కోరుతున్నట్లు తెలుస్తోంది. వీళ్లతో పాటు.. ఆ ఎమ్మెల్సీ స్థానంపై కారు పార్టీలో చాలామంది నేతలు ఆశలు పెట్టుకున్నారు.

సామాజిక సమీకరణాలను తెరమీదకు తీసుకొస్తున్నారు. ఎవరికి వారు తమకే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. దీంతో ఉన్నదే ఒక్క పదవి.. దాన్ని ఎవరికి ఇవ్వాలన్న దానిపై గులాబీ పార్టీ పెద్దలు డైలమాలో పడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాజకీయం అంతా బీసీల చుట్టూ తిరుగుతున్న వేళ.. ఆ వర్గం నుంచి భారీగా పోటీ కనిపిస్తోంది.

బీసీ కులగణన వ్యవహారం రాజకీయ రచ్చ రేపుతున్న వేళ.. ఒక్క ఎమ్మెల్సీ పదవిని బీసీలకే ఇవ్వాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. బీసీ కోటాలో.. దాసోజు శ్రవణ్, జోగు రామన్న, భిక్షమయ్య గౌడ్‌ ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు. ఎస్టీ కోటాలో మాజీ మంత్రి సత్యవతి రాధోడ్ మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

కేసీఆర్‌కు విన్నపం
ఎస్సీ సామాజికవర్గం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రసమయి బాలకిషన్.. తమకు ఆ పదవి ఇవ్వాలని కేసీఆర్‌కు విన్నవించినట్లు తెలుస్తోంది. ఇక మైనార్టీ కోటా నుంచి మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని మాజీ మంత్రి మహమూద్ అలీతో పాటు.. బీఆర్ఎస్ సీనియర్ నేత సలీం కోరుతున్నారట. వీళ్లు కాకుండా.. మరో ఇద్దరు ముగ్గురు సీనియర్ నేతలు కూడా.. ఎమ్మెల్సీ పదవిపై భారీగానే ఆశలు పెట్టుకున్నారని తెలుస్తోంది.

ఉన్నది ఒక్క ఎమ్మెల్సీ స్థానం అయితే.. పోటీపడుతోంది పది మందికి పైగా ఉండడంతో.. బీఆర్ఎస్ అధిష్టానం ఏంచేయాలో తెలియని పరిస్థితుల్లో ఉందట. ఎవరి స్థాయిలో వాళ్లు పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పదవి కోసం శతవిధాలుగా ట్రై చేస్తున్నారు. దీంతో పదవి ఎవరికి ఇవ్వాలి… మిగతావారిని ఎలా బుజ్జగించాలని కారు పార్టీ హైకమాండ్ సతమతం అవుతోందని టాక్.