TGSRTC Strike: ఆర్టీసీలో సమ్మె సైరన్.. ఆ రోజు నుంచి బస్సులు బంద్?
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
TGSRTC Strike: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 22 నుంచి సమ్మెకు వెళ్తున్నట్లుగా ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. మార్చి 13న సమ్మె నోటీసులు ఇచ్చామని.. ప్రభుత్వం, యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆర్టీసీ జేఏసీ తెలిపింది. ప్రభుత్వం సమ్మె నివారణ చర్యలు చేపట్టాలని కోరింది. ప్రభుత్వం, యాజమాన్యం ముందు 32 డిమాండ్లు పెట్టినట్లుగా జేఏసీ వైఎస్ చైర్మన్ థామస్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 22 నుంచి సమ్మెలోకి వెళ్తామంటూ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ప్రకటించారు. సాయంత్రం 4 గంటల సమయంలో లేబర్ కమిషన్ కి వెళ్లి సమ్మెకి సంబంధించిన అంశంతో పాటు తమ డిమాండ్లపై మాట్లాడారు. ఈసారి కూడా ఆర్టీసీ యాజమాన్యం తరపున ఎవరూ కూడా ఈ సమావేశానికి హాజరుకాలేదు. దీంతో సమ్మెకి వెళ్లాలని జేఏసీ నాయకులు నిర్ణయించుకున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నది ప్రధాన డిమాండ్ గా ఉంది. మార్చి 13న సమ్మె నోటీసులు ఇచ్చామని, కానీ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు.
కాగా, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అంశం పరిశీలనలో ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీ విలీనం, యూనియన్స్.. ఈ రెండు అంశాలు మినహా అన్ని సమస్యలపై చర్చించి పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తేల్చి చెప్పారు. ప్రేరేపిత సమ్మెకు వెళ్లొద్దని విజ్ఞప్తి కూడా చేశారు. అలాగే పెండింగ్ లో ఉన్న డీఏతో పాటు 2శాతం పెంచాము, పీఆర్సీ పరిశీలన చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.
