తెలంగాణలో నియంత్రిత సాగు విధానం రద్దు..రైతులు ఇష్టమైన పంటలు వేసుకోవచ్చు

తెలంగాణలో నియంత్రిత సాగు విధానం రద్దు..రైతులు ఇష్టమైన పంటలు వేసుకోవచ్చు

Updated On : December 27, 2020 / 7:23 PM IST

Telangana government decided to abolish controlled cultivation : తెలంగాణలో నియంత్రిత సాగు విధానాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి నియంత్రిత సాగు విధానం ఉండదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రైతులు ఇష్టమైన పంటలు వేసుకోవచ్చని తెలిపారు. ఏ పంట వేయాలో రైతులే నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇష్టం వచ్చినచోట రైతులే పంటను అమ్ముకోవచ్చని స్పష్టం చేశారు. ఎక్కడ మంచి ధర వస్తే అక్కడే అమ్ముకోవచ్చన్నారు. వచ్చే ఏడాది నుంచి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఉండవని తేల్చి చెప్పారు. ధాన్యాన్ని కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వానిది కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

రాష్ట్రంలో వివిధ రకాల పంటల కొనుగోళ్లు సహా ఇతర సాగు అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పంటల కొనుగోళ్లు, నియంత్రిత సాగు విధానం, రైతుబంధు అమలు, మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు – కొనుగోళ్లు, రైతుబంధు సమితుల బాధ్యతలు, రైతు వేదికల వినియోగం, సకాలంలో విత్తనాలు-ఎరువులు అందుబాటులో ఉంచడం, రైతులకు వ్యవసాయ సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం వంటి అంశాలపై సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుండి ప్రభుత్వం చేపట్టిన వివిధ రకాల పంటల కొనుగోళ్ల వల్ల చాలా నష్టం జరిగినట్లు అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు.

మరోవైపు రేపటి నుంచి రైతుబంధు ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందజేయనుంది. 61.49 లక్షల మంది రైతులకు చెందిన 1.52 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.5 వేల చొప్పున 2020 యాసంగి సీజన్ కోసం ప్రభుత్వం రూ.7,515 కోట్ల రూపాయలు పంట సాయంగా అందిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. రాష్ట్రంలోని ఏ ఒక్క రైతూ మిగలకుండా ప్రతి ఎకరానికీ డబ్బులు నేరుగా బ్యాంకులో జమ చేయాలని అధికారులను ఆదేశించారు.