Assam CM Himanta Biswa Sarma : గణేశ్ నిమజ్జనోత్సవంలో ఉద్రిక్తత.. అసోం సీఎం ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన టీఆర్ఎస్ కార్యకర్త
హైదరాబాద్ లో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ పర్యటన పొలిటికల్ రగడకు దారితీసింది. భాగ్యనగర ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన వేదికపై హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతుండగా టీఆర్ఎస్ కార్యకర్త అడ్డుకునే ప్రయత్నం చేశారు.

Assam CM Himanta Biswa Sarma : హైదరాబాద్ లో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ పర్యటన పొలిటికల్ రగడకు దారితీసింది. భాగ్యనగర ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన వేదికపై హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతుండగా టీఆర్ఎస్ కార్యకర్త అడ్డుకునే ప్రయత్నం చేశారు. సీఎం మాట్లాడుతుండగా మైక్ లాగేశాడు. తమ ఆహ్వానం మేరకు ఉత్సవాల్లో పాల్గొన్న అసోం సీఎంను అవమానించడం సరికాదంటూ టీఆర్ఎస్ నేతలపై భాగ్యనగర ఉత్సవ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అటు మైక్ లాగిన టీఆర్ఎస్ కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనతో ఎంజే మార్కెట్ దగ్గర కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు గణేశ్ నిమజ్జనంలో పాల్గొనేందుకు బీజేపీ నేత, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ వచ్చారు. ఆయన ప్రసంగాన్ని టీఆర్ఎస్ కార్యకర్త నందుబిలాల్ అడ్డుకునేందుకు యత్నించాడు. ఆ వెంటనే నందుబిలాల్‌ను గణేశ్ ఉత్సవ కమిటీ నిలువరించింది. పోలీసులు అతడిని అక్కడి నుంచి తరలించారు.
హైదరాబాద్ పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం చార్మినార్ ప్రాంతంలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన హిమంత బిశ్వ శర్మ.. ఆ తర్వాత మొజాం జాహీ మార్కెట్ కు వచ్చారు. మార్కెట్ దగ్గర ఏర్పాటు చేసిన వేదికపై ప్రసంగించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఆయన విమర్శలు గుప్పిస్తున్న సమయంలో ఉన్నట్టుండి శర్మ వెనుక నుంచి నందుబిలాల్ చొచ్చుకు వచ్చాడు. శర్మ ముందున్న మైక్‌ను తన చేతిలోకి తీసుకున్న అతడు శర్మతో వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా అప్రమత్తమైన గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు పోలీసులు నందుబిలాల్‌ను అక్కడి నుంచి కిందకు దించి తరలించారు. ఆ తర్వాత శర్మ తన ప్రసంగాన్ని కొనసాగించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.