CM KCR : దూకుడు పెంచిన కేసీఆర్.. జనగామ, భువనగిరిలో ప్రజా ఆశీర్వాద సభలు

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ, భువనగిరి నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు.

CM KCR : దూకుడు పెంచిన కేసీఆర్.. జనగామ, భువనగిరిలో ప్రజా ఆశీర్వాద సభలు

CM KCR

Telangana Assembly Elections 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మూడోసారి అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది. ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ వ్యూహాత్మక ఎత్తుగడలతో ప్రచార పర్వాన్ని హీటెక్కించేందుకు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే నియోజకవర్గాల వారిగా అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. నియోజకవర్గాల వారిగా పర్యటనలను షురూ చేశారు. ఆదివారం మ్యానిఫెస్టోను విడుదల చేయడంతో పాటు.. హుస్నాబాద్ లో జరిగిన బహిరంగ సభ ద్వారా ఎన్నికల శంఖారావం పూరించారు. సోమవారం జనగామ, భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు.

Read Also : CM KCR : పార్టీ అభ్యర్థులతో సీఎం కేసీఆర్ సమావేశం.. కీలక అంశాలపై అభ్యర్థులకు దిశా నిర్దేశం

జనగామ నియోజకవర్గంలో పల్లా రాజేశ్వరరెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అదేవిధంగా భువనగిరిలో ఫైళ్ల శేఖర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వారిద్దరిని గెలిపించాలని ప్రజలను కోరుతూ సోమవారం వేరేవేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. తొలుత జనగామలోని మెడికల్ కాలేజీ మైదానంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఆ తరువాత భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని మాట్లాడతారు. కేసీఆర్ సభలు నిర్వహించే ప్రాంతాలు గులాబీ మయం అయ్యాయి. ఈ సభకు భారీ సంఖ్యలో ప్రజలను తరలించేందుకు స్థానిక నేతలు ఏర్పాట్లు చేశారు.

Read Also : Revanth Reddy : మా మేనిఫెస్టోను కేసీఆర్ కాపీ కొట్టారు- రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో మధ్యాహ్నం 2గంటలకు నేరుగా జనగామలోని సభా ప్రాంగణం సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అనంతరం అక్కడ నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. అక్కడినుంచి భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభ వద్దకు వెళ్తారు. అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి విజయాన్ని కోరుతూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభా వేదికల వద్ద వర్షం వచ్చినా ఇబ్బంది తలెత్తకుండా రెయిన్ ప్రూఫ్ స్టేజీ వేశారు. సభలకు వచ్చే ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.