BJP Bandi Sanjay : జోష్‌లో తెలంగాణ బీజేపీ-కారుపై దూకుడు పెంచనున్న కమలనాధులు

తెలంగాణ బీజేపీలో జోష్ కనిపిస్తోంది. నిర్మల్‌ లో నిర్వహించిన తెలంగాణ విమోచన సభ సక్సెస్‌ కావటంతో ఇక తగ్గేదే లేదు అంటున్నారు.

BJP Bandi Sanjay : జోష్‌లో తెలంగాణ బీజేపీ-కారుపై దూకుడు పెంచనున్న కమలనాధులు

Bandi Sanjay Ts Bjp

Updated On : September 21, 2021 / 7:25 AM IST

BJP Bandi Sanjay : తెలంగాణ బీజేపీలో జోష్ కనిపిస్తోంది. నిర్మల్‌ లో నిర్వహించిన తెలంగాణ విమోచన సభ సక్సెస్‌ కావటంతో ఇక తగ్గేదే లేదు అంటున్నారు. షా ఫోన్‌కాల్‌తో…గులాబీ పార్టీపై పోరు మరింత ఉధృతం చేస్తామంటోంది కాషాయదళం. ఇంతకీ తెలంగాణ బీజేపీ వ్యూహం ఎంటీ? రాష్ట్ర నాయకత్వానికి అమిత్‌ షా ఫోన్‌లో ఏం చెప్పారు?

తెలంగాణ బీజేపీ నేతలకు అధిష్టానం నుంచి ఫుల్ సపోర్ట్ ఉందని…ఇక గులాబీపై పోరు మరింత ఉధృతం చేస్తామంటున్నారు. ఇప్పటికే బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రతో పార్టీని పటిష్టం చేస్తున్నారు. అయితే తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా బండి సంజాయ్ ఫోన్‌ చేశారు. యాత్ర జరుగుతున్న తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన సభను విజయవంతంగా నిర్వహించినందుకు అభినందనలు తెలిపారు అమిత్ షా. రాష్ట్ర నాయకత్వానికి పూర్తి అండదండలు ఉంటాయని చెప్పినట్టు సమాచారం.

టీఆర్ఎస్‌-బీజేపీ దోస్తులే అంటూ ప్రచారం, కేసీఆర్‌ ఒత్తిడి మేరకే హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడలేదన్న అభిప్రాయం వ్యక్తం చేశాయి కొన్ని పార్టీలు. దీంతో ఈ అంశాలన్నీ బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టికి వెళ్ళాయట. ఇందులో భాగంగానే నిర్మల్ వేదికగా టీఆర్ఎస్‌తో దోస్తీపై బీజేపీ నేతలు, కార్యకర్తలకు అమిత్ షా క్లారిటీ ఇచ్చారని చెప్తున్నారు. దీంతో ఇకపై టీఆర్ఎస్‌పై రెట్టించిన ఉత్సాహంతో పోరాటం చేస్తామని బీజేపీ నేతలంటున్నారు.
Also Read : Vijayawada Commercial Fest : విజయవాడలో వాణిజ్య ఉత్సవం

మరోవైపు బండి సంజయ్, మాజీమంత్రి ఈటల రాజేందర్‌ను అమిత్ షా పొగడ్తలతో ముంచెత్తారు. ప్రజల కష్టాలను తీర్చడానికే సంగ్రామ యాత్ర చేస్తోన్న బండిని ఆశీర్వదించాలని కోరారు. మరోవైపు ఈటల రాజేందర్‌ను సైతం ఫైటర్‌గా అభివర్ణించారు. దీంతో బండి సంజయ్, ఈటలకు హైకమాండ్ అండదండలు పుష్కలంగా ఉన్నాయన్న చర్చ జోరందుకుంది. హుజూరాబాద్‌లో అధికార పార్టీని ఎదుర్కోవటానికి కావాల్సినంత నైతిక మద్దతు లభించిందని కమలనాథులు చెప్పుకుంటున్నారు. ఇదే జోష్‌తో ముందుకెళుతూ తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకొస్తామంటున్నారు కమలదళం నేతలు. 2023లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.