త్వరలో ముగియనున్న టీఎస్‌పీఎస్సీ కాలపరిమితి.. కొత్త చైర్మన్‌ ఎవరో?!

  • Published By: bheemraj ,Published On : December 15, 2020 / 08:03 AM IST
త్వరలో ముగియనున్న టీఎస్‌పీఎస్సీ కాలపరిమితి.. కొత్త చైర్మన్‌ ఎవరో?!

Updated On : December 15, 2020 / 9:10 AM IST

TSPSC term expires soon : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కమిటీ కాలపరిమితి త్వరలో ముగియనుంది. ఈనెల 17తో టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణితోపాటు… ముగ్గురు సభ్యుల పదవీకాలం ముగుస్తుంది. ఒకవైపు 50వేల ఉద్యోగాల నియామకాలకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా… మరోవైపు టీఎస్‌పీఎస్సీ గడువు ముగియనుండడం ఆసక్తి రేపుతోంది.

టీఎస్‌పీఎస్సీ నిబంధనల ప్రకారం…. ఆరు సంవత్సరాల కాలపరిమితి పూర్తికానుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. పదవీకాలం ముగిసిన వారిలో టీఎస్‌పీఎస్‌ చైర్మన్‌ ఘంటా చక్రపాణి, సభ్యులు విఠల్‌, చంద్రావతి, మతినుద్దిన్‌ ఖాద్రీలు ఉన్నారు. వీరు మొత్తం ఆరు సంవత్సరాలపాటు టీఎస్‌పీఎస్సీకి సేవలందించారు. గురువారంతో వీరి పదవీ కాలయం ముగుస్తోంది.

టీఎస్‌పీఎస్సీ కాలపరిమితి ముగుస్తుండడంతో… ప్రభుత్వం కొత్తవారి ఎంపికపై దృష్టి సారించింది. ఇప్పుడున్న ఇద్దరు సభ్యుల్లోనే ఒకరిని చైర్మన్‌గా నియమించే అవకాశముంది. ఈనెల 21లోపు.. కొత్త కమిటీ నియామకం పూర్తిచేసే అవకాశముంది. ఆశావహులు మాత్రం చాలా మందే ఉన్నారు. వారంతా టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ పదవి కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది.

టీఎస్‌పీఎస్సీలో సభ్యునిగా పనిచేసిన వారు.. రెండోసారి మెంబర్‌గా పనిచేయడానికి అవకాశం లేదు. అంతేకాదు… చైర్మన్‌ పదవి చేపట్టిన వారికి కూడా … టీఎస్‌పీఎస్సీ నిబంధనల ప్రకారం రెండోసారి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం లేదు. ప్రస్తుతం ఉన్న ఘంటా చక్రపాణికి మరోసారి టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా కొనసాగే అవకాశం లేదు. దీంతో టీఎస్‌పీఎస్సీ పదవి కోసం పలువురు యూనివర్సిటీల అధికారులతోపాటు.. ఇప్పుడు కొనసాగుతున్న సభ్యుల్లో ఒకరిద్దరు చైర్మన్‌ సీటును ఆశిస్తున్నారు.

రెండు రోజుల కిందటే సీఎం కేసీఆర్‌ … ఖాళీ ఉద్యోగాల భర్తీపై సమీక్ష నిర్వహించారు. 50వేల ఉద్యోగాల భర్తీ చేపట్టాలని ఆదేశించారు. దీంతో ఉద్యోగాల భర్తీకి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. నిరుద్యోగులు కూడా కొత్త కొలువులపై ఆశలు పెట్టుకున్నారు. ఈ సమయంలో చైర్మన్‌తోపాటు…. సభ్యుల పదవీకాలం ముగుస్తుండడం…. వారి ఆశలపై నీరు చల్లినట్టయ్యింది. అయితే ప్రభుత్వం మాత్రం వీలైనంత త్వరగా కొత్త కమిటీని ఏర్పాటు చేసి.. ఉద్యోగాల భర్తీని చేపట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.