తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. పోస్టర్లు అంటించే కార్యకర్త కూడా సీఎం అవ్వొచ్చు- కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు నిద్ర పట్టకుండా చేస్తేనే బీజేపీ ఫస్ట్ స్థానంలోకి వస్తుంది. ఊళ్లో ఉన్న ప్రతి సమస్యను బీజేపీ కార్యకర్త సామరస్యంగా పరిష్కరించాలి.

Union Minister Dharmendra Pradhan (Photo Credit : Facebook)
Dharmendra Pradhan : రానున్న రోజుల్లో తెలంగాణలో సామాన్య కార్యకర్త సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. తెలంగాణలో బీజేపీని నెంబర్ వన్ పార్టీగా మార్చేందుకు తమ దగ్గర 1500 రోజుల ప్రణాళిక ఉందని ఆయన తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని ఆయన తేల్చి చెప్పారు. బీజేపీ అంటే ఉత్తర భారత దేశం పార్టీ అని కొంతమంది కామెంట్ చేశారని, కానీ పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీ ప్రాబల్యం ఉందని వారికి అర్థమైందని వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు.
”దక్షిణ భారతంలో బీజేపీ బలపడుతోంది. కేరళలో ఖాతా తెరిచింది. తమిళనాడులో మెరుగైన ఓటు బ్యాంక్ సాధించాం. పార్లమెంట్ ఎన్నికల్లో మూడోసారి కూడా కాంగ్రెస్ 100 సీట్లు దాటలేదు. 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. అయినా వారి నేత అహంకారంగా మాట్లాడుతున్నారు. మూడోసారి మోడీ నేతృత్వంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చింది. ఇండియా కూటమికి నాయకత్వమే లేదు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ తరచూ అవమానపరుస్తోంది. ఎన్డీయే అధికారంలో ఉన్ననీ రోజులు రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే లేదు. మోడీ ఉన్ననీ రోజులు రిజర్వేషన్లకు ఎటువంటి డోకా లేదు.
తెలంగాణ ప్రభుత్వం హిందూ విరోధి. గత పదేళ్ళు ఒక కుటుంబం రాష్ట్రాన్ని నాశనం చేసింది. ప్రత్యేక తెలంగాణ కోసం బీజేపీ మద్దతిచ్చింది. పదేళ్లలో తెలంగాణను అభివృద్ధి చేసేందుకు కేంద్రం సహకారం అందించింది. రాష్ట్రంలో పోలింగ్ బూత్ లెవెల్ లో బీజేపీ ని మరింత బలపరచాల్సిన అవసరం ఉంది. పార్టీలో కొత్త, పాత లేదు. బీజేపీలో చేరిన వారందరూ పాత వారే. ఈటల రాజేందర్ పార్టీకి కొత్త కాదు. ఆయన పాత అయిపోయాడు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు నిద్ర పట్టకుండా చేస్తేనే బీజేపీ ఫస్ట్ స్థానంలోకి వస్తుంది. ఊళ్లో ఉన్న ప్రతి సమస్యను బీజేపీ కార్యకర్త సామరస్యంగా పరిష్కరించాలి. అప్పుడే స్థానికంగా పార్టీ బలోపేతం అవుతుంది” అని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.
”ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీకి మద్దతుగా ఉంటున్న తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్నా. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలలో 8 స్థానాలు నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానిని చేయడానికి ఇచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రజలు మోదీకి అండగా నిలిచారు. ఇందుకు నిరంతరం కృషి చేసిన బీజేపీ కార్యకర్తలకు, మద్దతుగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు. నేను చెప్పిన మాటలను గుర్తుంచుకోండి.. తెలంగాణలో రాబోయే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే.. ఈ వేదికపై కూర్చున్న వారిలో ఎవరైనా లేదా పోస్టర్లు అంటించే కార్యకర్త కూడా నూతన ముఖ్యమంత్రి అవ్వొచ్చు” అని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.
Also Read : బీజేపీలో చేరేందుకు భయపడిపోతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..! ఎందుకో తెలుసా..