Uttam Kumar Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో అనూహ్య పరిణామం.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మళ్లీ యాక్టివ్ అవుతారా?

తెలంగాణ కాంగ్రెస్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌లో ఉత్తమ్ పాత్రకు ప్రాముఖ్యమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది.

Uttam Kumar Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో అనూహ్య పరిణామం.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మళ్లీ యాక్టివ్ అవుతారా?

Uttam Kumar Reddy

Nalamada Uttam Kumar Reddy: కాంగ్రెస్ రాజకీయాలు (Congress Politics) ఆసక్తికరంగా మారుతున్నాయి. పీసీసీ (PCC) మాజీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కీలకమైన స్టీరింగ్ కమిటీలోకి తీసుకున్న హస్తం పార్టీ.. ఆయన వ్యతిరేకులకు గట్టి ఝలక్కే ఇచ్చింది. ఉత్తమ్ పార్టీని వీడతారని.. గులాబీ బాస్.. సీఎం కేసీఆర్‌ (CM KCR) తో చర్చిస్తున్నారని ఇన్నాళ్లు జరిగిన ప్రచారాన్ని కాంగ్రెస్ ఏ మాత్రం లెక్కచేయలేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు అత్యంత ప్రధానమైన స్టీరింగ్ కమిటీ (steering committee)లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని తీసుకుని.. కాంగ్రెస్‌లో ఉత్తమ్ రోల్ చాలా కీలకమని చాటిచెప్పింది.. కొన్నాళ్లుగా కాంగ్రెస్‌లో ఉన్న గందరగోళాన్ని తొలగించింది.. ఉత్తమ్ మళ్లీ యాక్టివ్ అవుతారా? కాంగ్రెస్‌లో ఉత్తమ్ రోల్ ఎలా ఉండనుంది..?

తెలంగాణ కాంగ్రెస్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను డిసైడ్ చేసే స్టీరింగ్ కమిటీలో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి చోటివ్వడం హాట్‌టాపిక్‌గా మారింది. అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన ఈ నిర్ణయం వెనుక ఎలాంటి రాజకీయం జరిగిందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బీఆర్‌ఎస్‌కు వలస పోతారని.. ఆయనను పొమ్మనలేక పొగబెడుతున్నారని కొన్నాళ్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఉత్తమ్ కూడా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని బహిరంగ లేఖ రాశారంటే.. పార్టీలో ఆయన పరిస్థితి ఎంతలా దిగజారిందో చెప్పొచ్చు.

కానీ కాంగ్రెస్‌లో ఉత్తమ్ పాత్రకు ప్రాముఖ్యమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. అనూహ్యమైన ఆ నిర్ణయమే స్టీరింగ్ కమిటీలో సభ్యత్వం. సాధారణంగా కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీల్లో పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత, ఏఐసీసీ ఇన్‌చార్జిలే ఉంటారు. ఈ మూడింట్లో ఏ పదవీ లేని ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కూడా తెలంగాణ ఎన్నికల స్టీరింగ్ కమిటీలో ఎక్స్ ఆఫీషియో సభ్యుడిగా తీసుకున్నారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మాత్రమే ప్రత్యేకంగా స్థానమిచ్చి.. కాంగ్రెస్‌లో ఆయన పాత్ర కీలకమని తెలియజేసింది హైకమాండ్.

Also Read: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?

ప్రస్తుతం నల్లగొండ ఎంపీగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన స్థానంలో రేవంత్‌ను నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. ఆ తర్వాత నుంచి ఈ ఇద్దరి నేతల మధ్య గ్యాప్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఉత్తమ్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌లోనే ఓ వర్గం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. పరోక్షంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌పై విమర్శలు చేస్తున్నారు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. ఈ నేపథ్యంలోనే ఉత్తమ్ త్వరలో కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరిపోతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

Also Read: ఆర్. కృష్ణయ్యతో మాణిక్‌రావ్ ఠాక్రే భేటీపై కాంగ్రెస్ నేతల రుసరుస.. కారణం అదేనా?

తొలి నుంచి కాంగ్రెస్‌లో ఉన్న ఉత్తమ్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఓ సారి మంత్రిగా పనిచేశారు. పీసీసీ అధ్యక్షుడిగా పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే.. ఎన్నికల స్టీరింగ్ కమిటీలో ఉత్తమ్‌కు చోటిచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. ఈ నిర్ణయంతో ఉత్తమ్ మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ స్టీరింగ్ కమిటీయే అసెంబ్లీ అభ్యర్థులను నిర్ణయించే అవకాశం ఉండటంతో ఉత్తమ్ అనుచరులకు కొండంత బలం చేకూరిందని చెబుతున్నారు పరిశీలకులు.