Covid Vaccine: హైదరాబాద్‌లో నేటి నుంచి వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్!

తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. జీహెచ్‌ఎంసీలో వందశాతం వ్యాక్సినేషన్‌ లక్ష్యంగా వైద్య ఆరోగ్యశాఖ, కంటోన్మెంట్‌ బోర్డు..

Covid Vaccine: హైదరాబాద్‌లో నేటి నుంచి వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్!

Vaccine (1)

Updated On : August 23, 2021 / 6:55 AM IST

Covid Vaccine: తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. జీహెచ్‌ఎంసీలో వందశాతం వ్యాక్సినేషన్‌ లక్ష్యంగా వైద్య ఆరోగ్యశాఖ, కంటోన్మెంట్‌ బోర్డు, జీహెచ్‌ఎంసీ సంయుక్త ఆధ్వర్యంలో మొత్తం పదిరోజుల పాటు ఈ ప్రత్యేక డ్రైవ్‌ చేపడుతున్నారు. అవసరమైతే మరో ఐదు రోజులు పొడగించనున్నట్లు కూడా జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌ కోసం మొత్తం 175 సంచార టీకా వాహనాలు ఏర్పాటు చేశారు.

ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 150 సంచార టీకా వాహనాలు ఏర్పాటు చేయగా.. కంటోన్మెంట్‌ పరిధిలో మరో 25 మొబైల్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీలో మొత్తం 4,846 కాలనీలు, బస్తీల్లో కంటోన్మెంట్‌ పరిధిలోని 360 ప్రాంతాల్లో ఈ స్పెషల్ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కొనసాగుతుంది. ఇప్పటి వరకు అర్హులైనా వ్యాక్సిన్ వేసుకోని వారి కోసం ఈ మెగా డ్రైవ్ చేపట్టగా అర్హులైన పౌరులందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుతున్నారు.

వ్యాక్సిన్ ఇంటి ముందుకు తెచ్చేందుకే ఈ ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టగా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి టీకాలు వేసుకోని వారిని వివరాలను సైతం సిబ్బంది గుర్తించనున్నారు. ప్రతి కాలనీలో ఇద్దరు వ్యక్తులతో కూడిన మొబిలైజేషన్‌ టీమ్స్‌ టీకాలు తీసుకోని వారిని ముందుగానే గుర్తించి, వ్యాక్సిన్‌ వేసే తేదీ, సమయాన్ని తెలియజేస్తారు. వీరికి సహకరించి అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.