పార్లమెంట్ ఎన్నికల ముందు గ్రేటర్‌లో బీజేపీకి షాక్.. రాజీనామా చేసిన కీలక నేత
క్రమశిక్షణకు మారుపేరు అంటూ పెద్ద నాయకులు కొట్టుకుంటుంటే చోద్యం చూస్తున్నారు. పార్టీకోసం ఏమీ ఆశించకుండా పనిచేసినా గుర్తింపు ఇవ్వడం లేదని విక్రమ్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.

Vikram Goud
Vikram Goud : పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీకి షాక్ తగిలింది. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పంపించారు. గత కొంతకాలంగా పార్టీ తీరుపట్ల విక్రమ్ గౌడ్ అసంతృప్తితో ఉంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ టికెట్ ఆశించాడు. అయితే, అదిష్టానం ఆయనకు మొండి చెయ్యి చూపడంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ సమయంలో పార్టీ పెద్దలు విక్రమ్ గౌడ్ కు నచ్చజెప్పారు. అయితే, లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం అధిష్టానం కల్పిస్తుందని భావించినప్పటికీ ఎలాంటి హామీరాకపోవటంతో అసంతృప్తితో ఉన్న విక్రమ్ గౌడ్ తాజాగా పార్టీకి రాజీనామా చేశారు.
Also Read : అయోధ్య రామయ్య అందరికీ దేవుడు.. కాంగ్రెస్ రాజకీయం చేయడం తగదన్న బండి సంజయ్
పార్టీలో కొత్త వారిని అంటరానివారిగా చూస్తున్నారని, ఆవేదనతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కిషన్ రెడ్డికి రాసిన లేఖలో విక్రమ్ గౌడ్ పేర్కొన్నారు. క్రమశిక్షణకు మారుపేరు అంటూ పెద్ద నాయకులు కొట్టుకుంటుంటే చోద్యం చూస్తున్నారు. పార్టీకోసం ఏమీ ఆశించకుండా పనిచేసినా గుర్తింపు ఇవ్వడం లేదని విక్రమ్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాబలం లేని వారికి పెద్దపీటవేసి వారికి కింద పనిచేయాలని చెబుతున్నారని, ఎన్నికల తరువాత ఎవరు ఓటమికి, అసంతృప్తిపై ఎవరూ బాధ్యత తీసుకోలేదని కిషన్ రెడ్డికి రాసిన లేఖలో విక్రమ్ గౌడ్ పేర్కొన్నారు.
Also Read : ఆ 5 స్థానాలు టీడీపీకా? జనసేనకా? తూర్పుగోదావరి జిల్లాలో అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ
విక్రమ్ గౌడ్ మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు. బలమైన గౌడ సామాజిక వర్గం కావడం, గతంలో ముఖేష్ గౌడ్ సిటీలో బడా లీడర్ కావడంతో విక్రమ్ గౌడ్ బీజేపీని వీడటం గ్రేటర్ లో ఆ పార్టీకి దెబ్బేనని చెప్పొచ్చు. అయితే, త్వరలో విక్రమ్ గౌడ్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.