కొండా మురళి సంచలన కామెంట్స్‌పై వరంగల్ ఎమ్మెల్యేల భేటీ.. మీనాక్షి నటరాజన్ ఆరా.. చర్యలు తప్పవా?
కొండా మురళీ వాఖ్యలపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ ఇంట్లో వరంగల్ ఎమ్మెల్యేలు భేటీ అవడంపై మీనాక్షి నటరాజన్‌కు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సమాచారం ఇచ్చారు.

Konda Murali
వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డిపై కొండా మురళి తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీంతో కొండా మురళి వ్యాఖ్యలపై పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు భగ్గుమంటున్నారు. తాడో పేడో తేల్చుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు.
హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నివాసానికి పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు చేరుకుని చర్చించారు. ఈ భేటీలో పాల్గొన్న వారిలో కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు, నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఉన్నారు.
ఈ సమావేశం ముగిశాక నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. “పార్టీ మంచి చెడులు చర్చించుకున్నాం. సీనియర్లు, అనుభవజ్ఞులు ఎక్కడ పడితే అక్కడ వివాదాస్పండగా మాట్లాడటం సరికాదు. బీసీ కార్డు అడ్డం పెట్టుకుని మాట్లాడతామనడం సరికాదు.
ఏదైనా సమస్య ఉంటే పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకోవాలి. ఇప్పటికైనా అధిష్ఠానం ఆలోచించాలి. మనమే పార్టీకి నష్టం చేస్తే ఎలా? ఎమ్మెల్యేలందరి నిర్ణయం మేరకు తదుపరి చర్యలు ఉంటాయి. అధిష్ఠానాన్ని కలిసి ఫిర్యాదు చేస్తాం” అన్నారు.
మీనాక్షి నటరాజన్ ఆరా
వరంగల్ కాంగ్రెస్ పంచాయితీపై తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్ ఆరా తీశారు. కొండా మురళీ వాఖ్యలపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ ఇంట్లో వరంగల్ ఎమ్మెల్యేలు భేటీ అవడంపై మీనాక్షి నటరాజన్‌కు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సమాచారం ఇచ్చారు. ఈ అంశంపై త్వరలోనే పీసీసీ చీఫ్ నివేదిక తెప్పించుకోనున్నారు. ఆ తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉంది.