తాము పార్టీ మారలేదంటున్న జంపింగ్ ఎమ్మెల్యేలు.. ఎందుకీ కవరింగ్? పూర్తి వివరాలు..

మరి ఆ సభ్యులను బీఆర్ఎస్‌ పార్టీ తిరిగి తమ గూటికి చేర్చుకుంటుందా లేదా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది.

తాము పార్టీ మారలేదంటున్న జంపింగ్ ఎమ్మెల్యేలు.. ఎందుకీ కవరింగ్? పూర్తి వివరాలు..

Updated On : March 20, 2025 / 8:36 PM IST

తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల ఎపిసోడ్‌ క్లైమాక్స్‌కు చేరుకుంటోంది. బీఆర్ఎస్‌ పార్టీ కారు గుర్తుపై గెలిచి.. కాంగ్రెస్‌ గూటికి చేరిన పది మంది ఎమ్మెల్యేల పరిస్థితి గమ్మత్తుగా మారింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ చేస్తోన్న న్యాయపోరాటం ఆల్‌మోస్ట్ చివరి స్టేజ్‌కు వచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వం, అసెంబ్లీ స్పీకర్‌, అసెంబ్లీ కార్యదర్శితో పాటు, 10 మంది ఎమ్మెల్యేలకు, కేంద్ర ఎన్నికల సంఘానికి గతంలోనే నోటీసులు జారీ చేసింది కోర్టు. నోటీసుల ప్రకారం ఈనెల 22లోపు కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. మార్చి 25న ధర్మాసరం విచారణ జరపనుంది.

అయితే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో జరిగిన వాదనలు చూస్తే పార్టీ జంపింగ్‌ ఎమ్మెల్యేలకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. దీంతో సుప్రీం ఏం తీర్పు చెప్పబోతుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. అఫిడవిట్లు దాఖలు చేయడానికి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు 22 డేట్‌ దగ్గర పడుతుండటంతో పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఆ పది మంది ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా అఫిడవిట్లు దాఖలు చేస్తున్నారట.

రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశామంటూ..
తాము పార్టీ మారలేదని అఫిడవిట్‌లో పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశామే తప్ప కాంగ్రెస్ పార్టీలో చేరలేదని చెబుతున్నారట. సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే మీడియా దాన్ని వక్రీకరించి తాము పార్టీ మారినట్టుగా చూపించిందని సుప్రీంకోర్టులో దాఖలు చేస్తున్న అఫిడవిట్‌లో మెన్షన్ చేస్తున్నారట జంపింగ్ ఎమ్మెల్యేలు. తాము ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని, కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారని సమాచారం.

ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారట. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తాను సమర్పించిన అఫిడవిట్‌లో పార్టీ ఫిరాయించలేదని, కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని, బీఆర్ఎస్ పార్టీతో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పుకొచ్చినట్లు సమాచారం.

శాసనసభకు మూడోసారి ఎన్నికయ్యాక వ్యక్తిగత స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని చెప్పుకొచ్చిన మహిపాల్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో చేరలేదని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారట. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్రకాశ్‌ గౌడ్, కాలె యాదయ్య కూడా ఇదే విధంగా..తాము పార్టీ మారలేదని, బీఆర్ఎస్‌లోనే ఉన్నామని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినట్లు చర్చ జరుగుతోంది.

మరికొందరు ఎమ్మెల్యేలు కూడా..
వీళ్లు ముగ్గురే కాకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన మరికొందరు ఎమ్మెల్యేలు కూడా ఇలానే అఫిడవిట్లు వేస్తున్నారట. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేయి గుర్తుపై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. దీంతో ఆయన బీఆర్ఎస్‌తో సయోధ్య కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే హైడ్రాను వ్యతిరేకించడంతోపాటు అసెంబ్లీ సాక్షిగా అధికార కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టేలా మాట్లాడరన్న చర్చ జరుగుతోంది.

ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం, అసెంబ్లీ స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం అఫిడవిట్లలో ఏం చెప్పబోతున్నారనేది కూడా ఆసక్తికరంగా మారింది. సుప్రీంకోర్టు విచారణ తీరు చూస్తోంటే మాత్రం విషయం కాస్త సీరియస్‌గా ఉందన్న చర్చ జరుగుతోంది. మరి ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అఫిడవిట్లపై ఈ నెల 25న అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇవ్వబోతోందన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ మాత్రం కచ్చితంగా ఆ పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని, ఆ పది సీట్లకు ఉప ఎన్నికలు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తోంది.

అయితే అఫిడవిట్లు ఫైల్ చేస్తున్న ప్రకారం సదరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లోనే ఉన్నట్లు. మరి ఆ సభ్యులను బీఆర్ఎస్‌ పార్టీ తిరిగి తమ గూటికి చేర్చుకుంటుందా లేదా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు జంపింగ్ ఎమ్మెల్యేలు తాము బీఆర్ఎస్‌లోనే ఉన్నామని చెప్పడం కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చినట్లేనన్న టాక్ వినిపిస్తోంది. అనర్హత భయంతోనే అలా అవిడవిట్లు వేస్తున్నా వాళ్లు ఇప్పటికే హస్తం పార్టీలో అసంతృప్తిగా ఉన్నారన్న చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత జంపింగ్ ఎమ్మెల్యేల సెంట్రిక్‌గా పొలిటికల్ డెవలప్‌మెంట్స్ ఎలా ఉంటాయో చూడాలి మరి.