భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం.. ఉన్నతాధికారులను అప్రమత్తం చేసిన రేవంత్ రెడ్డి

ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, విద్యుత్ అంతరాయం లేకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం.. ఉన్నతాధికారులను అప్రమత్తం చేసిన రేవంత్ రెడ్డి

Rain

Updated On : August 7, 2025 / 7:50 PM IST

భారీ వర్షంతో హైదరాబాద్ నగరం మరోసారి తడిచి ముద్దయింది. అనేక ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీలో వర్షం పడడంతో ఆయా ఏరియాల్లో ట్రాఫిక్ నిదానంగా సాగుతుంది.

ఇటు ఎల్బీనగర్, నాగోలు, ఉప్పల్‌, హబ్సిగూడ, హయత్ నగర్, వనస్థలిపురం, దిల్‌సుఖ్‌ నగర్, మలక్ పేట్, అత్తాపూర్, కొత్తపేట, చంపాపేట, సంతోష్ నగర్, చాంద్రాయణగుట్ట, కాంచన్ బాగ్, షాలిబండ, ఛత్రినాక, సికింద్రాబాద్, కంటోన్మెంట్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

ఆఫీసుల నుంచి ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయంలో కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ అర్ధరాత్రి వరకు వర్షం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణ మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో భారీ వర్ష సూచన పై ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. సీఎస్, డీజీపీతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్, హైడ్రా కమిషనర్, విద్యుత్ విభాగం అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. విపత్తు నిర్వహణ బృందాలను సంసిద్ధం గా ఉంచాలని సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, విద్యుత్ అంతరాయం లేకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.