కరోనా నివారణకు ఏం చేస్తున్నారు ? ఎలాంటి వసతులు కల్పిస్తున్నారు – తెలంగాణ హైకోర్టు

తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసులపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా..కోర్టు పలు ప్రశ్నలను సంధించింది. 2020, జులై 28వ తేదీ మంగళవారం జరుగుతున్న విచారణకు సీఎస్ సోమేశ్ కుమార్ హజరై రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను కోర్టుకు వివరించారు.
కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది. కరోనా నివారణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు ? ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలాంటి వసతులు కల్పిస్తున్నారు ? ఇతర రాష్ట్రాలతో పోలిస్తే..కరోనా టెస్టులు చాలా తక్కువగా చేస్తున్నారని, మారుమూల జిల్లాల్లో వైరస్ సోకి..అనేక మంది చనిపోతున్నారని అభిప్రాయం వ్యక్తం చేసింది.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందక 38 మంది చనిపోయారని, హెల్త్ బులెటిన్ లో తప్పులు ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయని పేర్కొంది.
ఈ సందర్భంగా సీఎస్ కోర్టుకు పలు అంశాలను వివరించారు. కరోనా నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. ICMR, WHO గైడ్ లైన్స్ పాటిస్తున్నామని, ఇప్పటి వరకు రాష్ట్రంలో 3.50 లక్షల కరోనా టెస్టులు చేశామన్నారు. ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా టెస్టులు జరుపుతున్నట్లు వెల్లడించారు.
GHMCలో 1085 కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నాచారం ESI ఆస్పత్రిలో కరోనా టెస్టులు చేస్తున్నామన్నారు. కరోనా వైరస్ నివారణకు అధికారులు అందరూ…పని చేస్తున్నారని కోర్టుకు వివరించారు సీఎస్.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. 2020, జులై 28వ తేదీ మంగళవారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కొత్తగా 1610 కరోనా కేసులు నమోదు కాగా..9 మంది మరణించారు. తాజాగా నమోదైన కేసులతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 57 వేల 142 కేసులు నమోదయ్యాయి.
మరణాల సంఖ్య 830కి చేరింది. సోమవారం ఒక్కరోజే 15 వేల 839 కరోనా టెస్టులు నిర్వహించామని బులెటిన్ లో తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 42 వేల 909 మంది కోలుకున్నారని, 13 వేల 753 మంది చికిత్స పొందుతున్నట్లు వెల్లడించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 531 మంది కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.