దక్షిణాది రాష్ట్రాలను ఏకం చేస్తున్న డీలిమిటేషన్.. రేవంత్ టార్గెట్ అదేనా ? పోరులో కీలకం కాబోతున్నారా?
ఏప్రిల్ 14న హైదరాబాద్ వేదికగా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతలతో మీటింగ్ ఏర్పాటు చేశారు.

డీలిమిటేషన్ వ్యవహారంతో.. సౌత్ సెంటిమెంట్ రాజుకుంది. దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకం అవుతున్నాయ్. తమిళనాడులో మొదలైన ఉద్యమానికి.. సదరన్ స్టేట్స్ అన్నీ సై అంటున్నాయ్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా.. కేంద్రంపై యుద్ధంలో తగ్గేదే లే అంటున్నారు. చెన్నైలో ఫస్ట్ మీటింగ్ జరిగితే.. హైదరాబాద్‌లో నెక్ట్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు. డీమిలిటేషన్ ఫైట్‌తో రేవంత్ రెడ్డి అసలు టార్గెట్ వేరే ఉందా.. దక్షిణాది రాష్ట్రాలకు లీడర్‌గా ఎదగాలనుకుంటున్నారా.. జాతీయ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారా.. వరుస పరిణామాలు చెప్తుందేంటి..
జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై.. దక్షిణాది రాష్ట్రాలు భగ్గుమంటున్నాయ్. కేంద్రం ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని.. యుద్ధం ప్రకటించాయ్. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ అంటే.. దక్షిణాదిని రాజకీయంగా బలహీనం చేయడమే అంటూ ఫైర్ అవుతున్నాయ్. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలో.. చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు. డీలిమిటేషన్‌ను మరో పాతికేళ్లు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఇక డీలిమిటేషన్ ఫైట్‌లో.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన దూకుడు ఏంటో చూపిస్తున్నారు. నిజానికి మీటింగ్ జరిగింది చెన్నైలో అయినా.. తమిళనాడు కంటే ముందు నుంచే డీలిమిటేషన్, కేంద్రం తీరుపై సీఎం రేవంత్ ఫైర్ అవుతున్నారు. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది.
డీలిమిటేషన్ మీద భవిష్యత్‌లో యుద్ధం తప్పదంటూ.. ఢిల్లీ వేదికగా జరిగిన చర్చావేదికలో గతంలోనే రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అన్నట్లుగా దక్షిణాది రాష్ట్రాలు ఏకం అవుతున్నాయ్. ఐతే ఈ పోరాటాన్ని ఉద్ధృతం చేసే బాధ్యతను సీఎం రేవంత్ తీసుకున్నారు. ఏప్రిల్ 14న హైదరాబాద్ వేదికగా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతలతో మీటింగ్ ఏర్పాటు చేశారు. తమిళనాడు, కేరళ, కర్నాటక, ఏపీ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులకు ఆహ్వానం పంపించారు.
జానారెడ్డితో పాటు కేకే, డిప్యూటీ సీఎం భట్టికి.. సమావేశం బాధ్యతలు అప్పగించారు. ఇక ఇప్పటికే డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి మరీ.. తమ దూకుడు ఏంటో చూపించింది రేవంత్ సర్కార్. డీమిలిటేషన్ వ్యవహారంలోనే కాదు.. నిధుల విషయంలోనూ అన్యాయం జరుగుతోందని.. గతంలో ఢిల్లీ వేదికగా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. రేవంత్. ఇలా దక్షిణాది రాష్ట్రాల యుద్ధాన్ని మరింత ఉద్ధృతం చేసే బాధ్యత భుజాలకు ఎత్తుకున్న సీఎం రేవంత్.. సదరన్ స్టేట్స్‌కు నాయకత్వం వహించి.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తున్నారనే చర్చ జరుగుతోంది.
Also Read: ఫ్యామిలీ ఫ్యామిలీనే.. పాలిటిక్స్ పాలిటిక్సే.. స్కెచ్ ఏంటి.. ఏం జరగబోతుంది?
నిజానికి కేంద్రానికి వ్యతిరేకంగా దక్షిణాది నుంచి గతంలో చాలామంది నేతలు, చాలా పార్టీలు పోరాటం చేశాయ్. ఆ తర్వాత సైలెంట్ అయిపోయాయ్. గతంలో కేరళ, తమిళనాడు ముఖ్యమంత్రులు ఇలాంటి ప్రయత్నాలే చేశారు. ఐతే అందరూ ఏకతాటిపైకి రాలేకపోయారు. లేఖలతోనే సరిపోయింది. ఇప్పుడు రేవంత్‌కు కాస్త పరిస్థితులు కలసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయనే చర్చ జరుగుతోంది.
అందుకే డీలిమిటేషన్‌తో పాటు.. నిధుల విషయంలో కేంద్రంపై యుద్ధాన్ని రేవంత్ సీరియస్‌గా తీసుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. దక్షిణాది నుంచి ఎన్టీఆర్, చంద్రబాబులాంటి వాళ్లు.. కేంద్రంలో చక్రం తిప్పారు. 1989లో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటులో.. వీపీ సింగ్ ప్రధాని కావడంలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించగా.. ఎన్డీఏలో చక్రం తిప్పి వాజ్‌పేయిని ప్రధాని చేయడంలో చంద్రబాబు కీ రోల్ ప్లే చేశారు. ఇక అటు కేసీఆర్ కూడా టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చి.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే ప్రయత్నం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలను ఏకం చేసే ప్రయత్నం చేశారు.
జాతీయ రాజకీయాలను డిసైడ్ చేయడంలో తెలుగు రాష్ట్రాలు ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తూనే ఉన్నాయ్. దీంతో ఇప్పుడు అదే జాతీయ రాజకీయాలపై తనదైన ముద్ర వేసేందుకు రేవంత్ రెడీ అవుతున్నారా.. దీనికోసం డీలిమిటేషన్ అంశాన్ని ఆయుధంగా మార్చుకుంటున్నారా అనే చర్చ కూడా వినిపిస్తోంది.
దక్షిణాది రాష్ట్రాలు ఏకం అయ్యేందుకు.. అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయ్. ఇలాంటి సమయంలో దక్షిణాది తరఫున యుద్ధంలో ముందుండాలని రేవంత్ ఫిక్స్ అయినట్లు కనిపిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులు, రాష్ట్ర హక్కుల సాధనకు కేంద్రంపై ఘాటైన విమర్శలను సంధిస్తున్న ఆయన.. ఇప్పుడు డిలిమిటేషన్‌పై వార్‌తో.. నేషనల్ పాలిటిక్స్‌లో కీలక నేతగా మారడం ఖాయంగా కనిపిస్తుందన్నది మరికొందరి అభిప్రాయం. మరి రేవంత్ మోగిస్తున్న సౌత్ సైరెన్.. రాజకీయంగా ఎలాంటి సంచలనాలకు కారణం అవుతుందో చూడాలి.