అసలు నర్సాపూర్‌లో ఏం జరుగుతోంది? ముగ్గురు నేతలు ఎవరికివారే యమునా తీరే!

నియోజకవర్గానికి చెందిన ముగ్గురు కీలక నేతల మధ్య సరైన సఖ్యత, సమన్వయం లేదా?

అసలు నర్సాపూర్‌లో ఏం జరుగుతోంది? ముగ్గురు నేతలు ఎవరికివారే యమునా తీరే!

Updated On : December 23, 2024 / 8:12 PM IST

నర్సాపూర్‌.. ఒకప్పుడు కాంగ్రెస్‌ కంచుకోట. ఐతే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ.. ఈ నియోజకవర్గంలో హస్తం పార్టీ విజయం అందుకోలేకపోయింది. 2023లో గట్టి ప్రయత్నమే చేసినా.. కారు స్పీడ్‌కు బ్రేక్‌లు వేయలేకపోయింది. అలాంటి నర్సాపూర్‌లో గ్రూప్‌ రాజకీయాలు.. హస్తం పార్టీని ఇబ్బంది పెడుతున్నాయ్. ముగ్గురు నేతలు ఎవరికి వారే అన్నట్లుగా గ్రూప్‌ పాలిటిక్స్ నడిపిస్తున్నారనే టాక్ నడుస్తోంది. దీంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో కొత్త టెన్షన్‌ మొదలైంది. ఇంతకీ నర్సాపూర్‌లో ఏం జరుగుతోంది.

నర్సాపూర్‌ కాంగ్రెస్‌ను గ్రూప్‌ తగాదాలు టెన్షన్‌ పెడుతున్నాయ్. ముగ్గురు నేతలు.. ఎవరికివారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో.. ఎవరిని ఫాలో కావాలో, ఏం చేయాలో తెలియక.. కేడర్ తెగ కన్ఫ్యూజ్ అయిపోతుందని టాక్‌. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన మదన్‌ రెడ్డి.. ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన ఆవుల రాజిరెడ్డితో పాటు.. మరో నేత ఆంజనేయ గౌడ్.. ముగ్గురు నేతలూ ఎవరికి వారే గ్రూప్ రాజకీయాలు చేస్తూ.. కేడర్‌ను తికమక పెడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌లోకి ఎందుకు చేరానా అనే నిర్వేదంలోకి మదన్‌ రెడ్డి వెళ్లారంటూ.. నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయ్.

అస్తవ్యస్తంగా పార్టీ పరిస్థితి?
నర్సాపూర్‌ నియోఅస్తవ్యస్తంగా జవర్గ ఇంచార్జిగా ఉన్న ఆవుల రాజిరెడ్డి వ్యవహారం.. మదన్‌ రెడ్డి, ఆంజనేయ గౌడ్‌కు చిరాకు తెప్పిస్తున్నాయట. దీంతో హస్తం పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. 2023 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డిని పక్కనపెట్టి.. సునీతా లక్ష్మారెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. దీంతో కారు పార్టీ మీద అలిగిన మదన్.. హస్తం గూటికి చేరుకున్నారు. ఐతే కాంగ్రెస్‌లో పరిస్థితులపై ఆయన అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. సీనియర్ నాయకుడైన తనకు.. పార్టీలో ప్రాధాన్యత ఇవ్వటం లేదని వాపోతున్నారు. దీంతో మదన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్‌లోకి వెళ్తారా అనే చర్చ మొదలైంది.

మదన్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌లో చేరిన కార్యకర్తలు, నేతలు పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉందనే చర్చ జరుగుతోంది. ఆవుల రాజిరెడ్డి తీరుపై మరో నేత ఆంజనేయ గౌడ్ కూడా సీరియస్‌గా ఉన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఉన్నా.. నియోజకవర్గ కార్యక్రమాలకు తనను ఆహ్వానించడం లేదని గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. అలక పాన్పు ఎక్కి ఒకరు.. అసంతృప్తితో మరొకరు.. దీంతో మూడుముక్కలాట అన్నట్లుగా కాంగ్రెస్‌లో పరిస్థితి తయారైంది. ఇదే ఇప్పుడు హస్తం పార్టీ కార్యకర్తలను టెన్షన్ పెడుతోందనేది లోకల్‌ కేడర్‌ టాక్‌..

గ్రౌండ్‌ లెవల్‌లో పార్టీ మరింత వీక్ అయ్యే ప్రమాదం
కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియోజకవర్గాల్లో నర్సాపూర్ ఒకటి. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ హస్తం పార్టీ విజయం సాధించలేదు. నర్సాపూర్‌లో బీఆర్ఎస్‌ చాలా స్ట్రాంగ్. ఐతే గ్రూప్ తగాదాలు ఇలానే కొనసాగితే.. గ్రౌండ్‌ లెవల్‌లో పార్టీ మరింత వీక్ అయ్యే ప్రమాదం ఉంటుందని కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన కనిపిస్తోంది. ఇక ఆవుల రాజిరెడ్డి వ్యవహారంపై.. సొంత పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయ్.

కనీసం ఫోన్‌లో కూడా ఎవరికీ అందుబాటులో ఉండరని.. ప్రభుత్వ పథకాలను జనాల్లోకి తీసుకెళ్లడంలో విఫలం అవుతున్నారని.. సొంత పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయ్. ఐతే నియోజకవర్గానికి చెందిన ముగ్గురు కీలక నేతల మధ్య సరైన సఖ్యత, సమన్వయం లేదు. అధిష్టానం ఇప్పటికైనా చొరవ తీసుకొని సఖ్యత కుదర్చకపోతే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ప్రభావం పడే అవకాశం ఉందని.. హస్తం పార్టీ నేతలు అంటున్నారు.

ముగ్గురు నేతలు.. అప్పుడప్పుడు వేదికల మీద కనిపిస్తున్నా.. కలిసిపోయినట్లు అనిపిస్తున్నా.. గ్రూప్ రాజకీయాలు మాత్రం రోజురోజుకు పెరిగిపోతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురికి తోడు.. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ఈ మధ్యే బాధ్యతలు తీసుకున్న సుహాసిని కూడా ఓ వర్గాన్ని కూడగట్టుకుంటున్నారు. ఏమైనా మూక చెదిరి మూడు ముఠాలైంది అన్నట్లుగా నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మారింది. అధిష్టానం జాగ్రత్తలు తీసుకోకపోతే.. పార్టీ పరిస్థితి మరింత బలహీనం అయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.

తెలంగాణ పాలిటిక్స్‌ను మలుపు తిప్పిన “పుష్ప”.. ఈ పార్టీల యుద్ధం ఏ మలుపు తిరగబోతుంది?