వివాదాలకు కేరాఫ్‌గా గ్రూప్-1 పరీక్షలు.. అసలు ఏమిటీ సమస్యలు?

TGPSC వైఫల్యాలను ఎండగడుతూ ఆందోళనలకు కూడా సిద్ధమవుతోందన్న టాక్ విన్పిస్తోంది.

వివాదాలకు కేరాఫ్‌గా గ్రూప్-1 పరీక్షలు.. అసలు ఏమిటీ సమస్యలు?

Group-1 candidates

Updated On : April 19, 2025 / 9:30 PM IST

గ్రూప్-1..తెలంగాణలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోందా? గ్రూప్-1ను అడ్డం పెట్టుకుని గతంలో బీఆర్ఎస్ సర్కార్ ను ఇబ్బంది పెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నించిందా? ఇప్పుడు అదే గ్రూప్-1 పరీక్షను అడ్డం పెట్టుకుని అధికార కాంగ్రెస్ ఇరకాటంలో పడేయాలని బీఆర్ఎస్ స్కెచ్ వేస్తోందా? దీంతో తెలంగాణలో గ్రూప్-1 అంటేనే పొలిటికల్ కాంట్రవర్సీగా మారిపోయింది. గ్రూప్-1లోకి హఠాత్తుగా ప్రత్యక్ష్యమైన ఆ 10మంది అభ్యర్దులు ఎవరన్నది తేలాలని BRS పట్టుబట్టడంతో ఈ వ్యవహారం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.

తెలంగాణలో గ్రూప్-1 పరీక్షల వ్యవహారం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. గతంలో BRS అధికారంలో ఉన్న సమయంలోను, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గ్రూప్-1 వివాదం మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 2011లో గ్రూప్-1 పరీక్షలు సజావుగా జరిగి రిక్రూట్‌మెంట్ సైతం కంప్లీట్ అయింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత పోస్టుల భర్తీ కోసం ప్రయత్నాలు జరిగినా సక్సెస్ కాలేదు.

BRS హయాంలో 2022లో గ్రూప్ వన్ కోసం మొదటిసారిగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. షెడ్యూలు ప్రకారం నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు దాదాపు 2.80 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యరు. ఆ తర్వాత పేపర్ లీకేజీ అయిందనే బాంబు లాంటి వార్త రావడంతో పలు స్థాయిల్లో దర్యాప్తు జరిగిన అనంతరం చివరకు పరీక్షలను రద్దు చేస్తున్నట్టు కమిషన్ ప్రకటించింది. రెండోసారి ప్రిలిమ్స్‌ను 2023 జూన్‌లో నిర్వహించింది. బయోమెట్రిక్ విషయంలో సరైన నిబంధన పాటించలేదని, OMR షీట్స్‌ పైన హాల్ టికెట్ నెంబర్ లేదనే కారణంతో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా కమిషన్ వైఫల్యం బట్టబయలైంది. దీంతో ఆ పరీక్షలు మరోసారి రద్దయ్యాయి.

అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళనలు
ఇలా BRS హయాంలో గ్రూప్-1 పరీక్ష పేపర్ లీక్ అయినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఈ అంశాన్ని రాజకీయ అస్త్రంగా వాడుకుందట. అప్పటి అధికార బీఆర్ఎస్ సర్కార్ ను ఇరుకునపెట్టేలా పెద్ద ఎత్తున ఆందోళనలు చేసింది. గ్రూప్-1 పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో BRS సర్కార్ పెద్దల హస్తం ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే మరోసారి గ్రూప్-1 పరీక్ష నిర్వహించేందుకు BRS ప్రభుత్వం ప్రయత్నించినా విషయం కోర్టు పరిధిలోకి వెళ్లడం, అంతలోనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడం జరిగింది.

సీన్ కట్ చేస్తే..కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన తర్వాత కూడా గ్రూప్-1 వివాదాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. 2024 అక్టోబర్ లో TGPSC ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 21వేల, 75 మంది హాజరైతే..ఫలితాలు ప్రకటించే సమయానికి 21వేల, 85 మంది అభ్యర్థులు ఉన్నారని ప్రకటించడం వివాదాస్పదమైంది. మొత్తం 46 సెంటర్లు ఏర్పాటు చేస్తే 15 సెంటర్ల నుంచే మొత్తం టాపర్లు ఉండటం, మిగతా సెంటర్ల నుంచి ఒక్కరంటే ఒక్కరూ లేకపోవడంపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

టాప్‌-500లో కోఠి మహిళా కాలేజీ సెంటర్‌లో రాసిన అభ్యర్థులే 75 మంది ఎంపికవ్వడంపై అనుమాలకు తావిచ్చింది. టాప్‌-100, టాప్‌-500లో ఒక్క తెలుగు మీడియం అభ్యర్థి కూడా లేరని అభ్యర్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. TGPSC గ్రీవెన్స్‌సెల్‌ను వెయ్యి మంది ఆశ్రయిస్తే ఇప్పటి వరకు ఒక్కరికి కూడా సమాధానమివ్వలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గ్రూప్-1 అంశాన్ని ప్రతిపక్షంగా ఉన్న BRS సీరియస్ గా తీసుకుందట. గతంలో తాము అధికారంలో ఉన్న సమయంలో తమ సర్కార్ ను టార్గెట్ చేసిన కాంగ్రెస్ ను ఇప్పుడు ఇరకాటంలో పెట్టాలని డిసైడ్ అయ్యిందట. అందుకే ఓ వైపు గ్రూప్-1 అభ్యర్ధులకు మద్దుతు ఇస్తూనే, మరోవైపు కోర్టుల్లో కేసులను కూడా దాఖలు చేస్తోంది BRS. TGPSC వైఫల్యాలను ఎండగడుతూ ఆందోళనలకు కూడా సిద్ధమవుతోందన్న టాక్ విన్పిస్తోంది.

అధికార కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు చెందిన వారికి దొడ్డిదారిన గ్రూప్-1 ఉద్యోగాలు ఇచ్చే కుట్ర జరిగిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో మొత్తం 21 ఉల్లంఘనలు జరిగాయని ఆరోపిస్తున్న బీఆర్ఎస్..కోర్టును ఆశ్రయించేందుకు రెడీ అవుతుందట. దీంతో ఇప్పుడు గ్రూప్-1 వ్యవహారమంతా ఇప్పుడు రాజకీయాల చుట్టే తిరుగుతోంది. మరి చివరికి ఈ వ్యవహారం ఎటు మలుపు తిరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.