కవిత కోసం అంత త్యాగానికి సిద్ధపడే మంత్రి ఎవరు?

kavitha: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచిన కవితకు ఇప్పుడు కేబినెట్‌లో చోటు దక్కుతుందా లేదా అనే అంశంపై పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. అధినేత కేసీఆర్ ఆమెకు అవకాశం ఇస్తారా? లేదా? అన్న విషయం ఎవరికీ అంతుచిక్కడం లేదట. కవితకు మంత్రి ఇవ్వాలని తీర్మానిస్తూ త్వరలో నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలంతా కలసి కేసీఆర్‌కు తెలియజేయాలని భావిస్తున్నారని అంటున్నారు. అందరి అంచనాలకు అనుగుణంగానే కవిత ఎమ్మెల్సీగా గెలిచారు. ఆమెకు ఉన్నత పదవి గ్యారెంటీ అంటూ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
కవిత కోసం అంత త్యాగానికి ఎవరు సిద్ధపడతారు?
ఎమ్మెల్సీగా గెలిచిన కవితను కొత్తగా కేబినెట్‌లోకి తీసుకుంటే ఇప్పుడున్న వారిలో ఎవరో ఒకరు త్యాగం చేయాల్సి ఉంటుందని అంటున్నారు. మరి కవిత కోసం అంత త్యాగానికి ఎవరు సిద్ధపడతారనే దానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. భారీ విజయంతో కవిత పొలిటికల్ రీ ఎంట్రీ ఇచ్చారు. ఆమె గెలుపు కోసం గులాబీ పార్టీ వేసిన స్కెచ్ ఫుల్ వర్కవుట్ అయ్యిందంటున్నారు. కవిత గెలుపుతో నిజామాబాద్ టీఆర్ఎస్ పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది. ఎమ్మెల్సీగా ఎన్నికైన కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటనే దానిపై చర్చ జరుగుతోంది.
త్యాగం చేయకంటే తొలగింపు తప్పదా?
ప్రస్తుతానికి కవిత ఎమ్మెల్సీ పదవితోనే సరిపెట్టుకుంటారా? కేబినెట్‌లో అవకాశాన్ని దక్కించుకొనేందుకు ప్లాన్ చేస్తారా? అని పార్టీ కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు. కేబినెట్‌లో అవకాశం దక్కుతుందని కొందరు అంటుంటే.. కేబినెట్ హోదా కలిగిన శాసనమండలి విప్‌గా బాధ్యతలు అప్పగిస్తారని మరికొందరు చెబుతున్నారు. ఎక్కడ చూసినా అదే చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం కేబినెట్‌లో ఖాళీలు లేవంటున్నారు. కవితకు మంత్రి పదవి ఇవ్వాలంటే ఎవరో ఒకరు తమ పదవిని త్యాగం చేయాల్సి ఉంటుంది. లేదా అధిష్టానమే తొలగించి కవితకు చాన్స్ ఇవ్వాలి. అధిష్టానం తొలగిస్తే విమర్శలు ఎదుర్కొనాల్సి వస్తుందని భావిస్తున్నారు.
మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు రెడీ అంటున్న సీఎంకి అత్యంత విధేయుడు:
ఇదంతా ఇప్పటికిప్పుడు జరిగే అవకాశం లేకపోవడంతో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాతే కవితను కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉందని టాక్. అయితే అప్పటి వరకు ఆమెకు ఆ హోదాతో సమానంగా ఉండే ప్రభుత్వ విప్ లేదా మరో పదవి కట్టబెట్టే అవకాశం ఉందనే ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఒక మంత్రిని పదవీ త్యాగానికి సిద్ధంగా ఉండాలని గులాబీ బాస్ కేసీఆర్ సంకేతాలు ఇచ్చారని అంటున్నారు. సీఎంకు అత్యంత విధేయునిగా ఉండే ఓ మంత్రి తాను రాజీనామా చేసేందుకు రెడీ అని చెబుతున్నారని టాక్.
కేటీఆర్ సీఎం అయితే కవితే మంత్రి:
మరోపక్క, సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే కేటీఆర్ సీఎం అవుతారని అంటున్నారు. అప్పుడు కేటీఆర్ స్థానంలో కవిత మంత్రిగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ద్విపాత్రాభినయం చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇవన్నీ తేలాలంటే కొద్ది కాలం వేచి చూడాల్సిందే.