అందుకే హరీశ్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్లారా? కొన్నాళ్లు సైలెంట్‌గా ఉండాలని కవితకు కేసీఆర్ చెప్పారా?
ఇదే సమయంలో ఎమ్మెల్సీ కవిత సైతం కాస్త సైలెంట్ అయిపోతారన్న టాక్ పార్టీ వర్గాల్లో నడుస్తోంది.

మా మధ్య విభేదాల్లేవు.. మేమంతా ఒక్కటే..పార్టీ కోసం కలిసి పనిచేస్తాం.. మళ్లీ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే మా లక్ష్యం..ఎస్..బావా, బావమరుదులు చెప్పదలుచుకున్నది ఇదేనా? కొన్ని రోజులుగా బీఆర్ఎస్ లో జరుగుతున్న ప్రచారానికి తెరదించేందుకే కేటీఆర్..హరీష్ ఇంటికి వెళ్లారా? అంటే అవుననే అంటున్నాయి తెలంగాణ భవన్ వర్గాలు. కేసీఆర్ కుటుంబంతో పాటు గులాబీ పార్టీలో ఏదో జరుగుతోందన్న క్యాడర్ అనుమానాలు, ఆందోళనలకు పుల్ స్టాప్ పెడుతూ..మేమంతా ఒక్కటేనని చెప్పకనే చెప్పారా కేటీఆర్, హరీష్ రావులు?
గులాబీ పార్టీలో జరుగుతున్న పరిణామాలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. 2023లో పార్టీ ఓటమి పాలై అధికారం కోల్పోయాక పరిస్థితుల్లో క్రమంగా మార్పు వస్తుందన్న టాక్ విన్పిస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్ దాదాపు ఫామ్ హౌస్ కే పరిమితం కావడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అన్నీ తానై నడిపిస్తున్నారు కేటీఆర్. ఇదే సమయంలో కేసీఆర్ కుటుంబ సభ్యులైన మాజీ మంత్రి హరీష్ రావు..పార్టీలో పరిమితమైన పాత్ర పోషిస్తున్నారన్న చర్చ గులాబీ వర్గాల్లో నడుస్తోంది.
Also Read: మహానాడు తర్వాత నారా లోకేశ్‌కు కీలక పదవి?
ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఏ కార్యక్రమం నిర్వహించినా వాటన్నింటిలోనూ కేటీఆరే కనిపిస్తున్నారు. దీంతో హరీష్ రావు సాధ్యమైనంత వరకు తన నియోజకవర్గం సిద్దిపేటకు మాత్రమే పరిమితం అవుతున్నారట. దీంతో తనకు పార్టీలో తగిన ప్రాధాన్యం దక్కడంలేదని హరీష్ రావు అలకబూనారని, అందుకే పార్టీ కార్యక్రమాలకు అంటీ ముట్టనట్లు ఉంటున్నారనే ప్రచారం పార్టీ నేతల్లో జరుగుతోంది. అంతే కాకుండా కేటీఆర్ కు హరీష్ రావుకు మధ్య అంతరం పెరిగిందని, కేసీఆర్ కుటుంబంలో విభేదాలు చెలరేగాయన్న టాక్ సైతం పొలిటికల్ సర్కిల్స్ లో వినిపించింది.
ఈ క్రమంలోనే హరీశ్ రావు బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారని, కొత్త రాజరీయ పార్టీ పెడుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో మా పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని హరీశ్ రావు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో పార్టీ పగ్గాలు కేటీఆర్ కు అప్పగిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే దానిని కట్టుబడి ఉంటానని హరీశ్ స్వయంగా ప్రకటించి ఊహాగానాలకు తెరదించే ప్రయత్నం చేశారు . అయినా ఎక్కడో తేడా కొడుతోందన్న చర్చ పార్టీ వర్గాల్లో సాగిందట. పైకి అలా చెబుతున్నారే కానీ..లోపల ఏదో జరుగుతోందన్న అనుమానాన్ని కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారట.
రూమర్స్‌కు చెక్ పెట్టడానికే?
దీంతో ఇక లాభం లేదనుకొని స్వయంగా కేటీఆర్ రంగంలోకి దిగారట. పార్టీలో జరుగుతున్న రూమర్స్ కు చెక్ పెట్టాలంటే బావ హరీష్ రావును కలవడమే మంచిదని ఆయన భావించినట్లు నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే హరీశ్ రావు నివాసానికి కేటీఆర్ వెళ్లి కలిశారని అంతా అనుకుంటున్నారు. హరీశ్ రావుతో దాదాపు రెండు గంటల పాటు సమావేశమైన కేటీఆర్..ఆయనతో ఏకాంతంగా సుమారు 45 నిమిషాల పాటు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సుధీర్ఘ భేటీలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, బీఆర్ఎస్ లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణ వంటి అంశాలపై సుధీర్ఘంగా చర్చించినట్లు గులాబీవర్గాల్లో చర్చ జరుగుతోంది.
పార్టీలో కొన్ని రోజులుగా జరుగుతున్న రూమర్స్ కు చెక్ పెట్టేందుకే కేటీఆర్..హరీష్ రావు ఇంటికి వెళ్లి కలిశారన్న టాక్ రాజకీయవర్గాల్లో విన్పిస్తోంది. ఈభేటీ ద్వారా తమ మధ్య ఏ మాత్రం విభేదాలు లేవని, అంతా కలసికట్టుగానే ఉన్నామని, ఇకపై పార్టీ భవిష్యత్తు కోసం పనిచేస్తామని క్యాడర్ కు సందేశం ఇచ్చారని అంటున్నారు. మళ్లీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఇలాగే కలిసి పనిచేస్తామని చెప్పకనే చెప్పారని, ఈ పరిణామంతో బీఆర్ఎస్ లో ఎలాంటి విభేదాలు లేవని, మరీ ముఖ్యంగా హరీష్ రావు ఏమాత్రం అసంతృప్తితో లేరని, కేటీఆర్ తో సఖ్యతగానే ఉన్నారనే మెస్సేజ్ వెళ్లిందని భావిస్తున్నారట.
ఇదే సమయంలో ఎమ్మెల్సీ కవిత సైతం కాస్త సైలెంట్ అయిపోతారన్న టాక్ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. కొద్దిరోజుల క్రితం గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పించి కేసీఆర్ ను, పార్టీని ఇరకాటంలో పడేశారన్న విమర్శలను ఎదుర్కొన్న కవిత..ప్రస్తుతం అమెరికా పర్యటనకు వెళ్లారు. యూఎస్ నుంచి వచ్చిన తర్వాత దూకుడుగా వ్యవహరించవద్దని, పార్టీ లైన్ లో కేటీఆర్, హరీష్ లతో కలిసి పనిచేయాలని ఆమెకు కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
మొత్తానికి హరీశ్ ఇంటికి కేటీఆర్ స్వయంగా వెళ్లి కలవడంతో పార్టీలో విన్పిస్తున్న గుసగుసలకు చెక్ పెట్టినట్లు అయిందన్న చర్చ నడుస్తోంది. ఈ భేటీతో ఇక పార్టీలో నెలకొన్న అనుమానాలకు, ఆందోళనలకు తెరపడినట్టేనని, ఇకనుంచి మరింత ఉత్సాహంతో పార్టీ కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఉదృతం చేయాలని కేటీఆర్ డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.