Konda Surekha: మంత్రులందరిని కొండా సురేఖ ఇరికించారా? ఎందుకలా?

ఇలా నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ వార్తల్లో నిలుస్తున్నారు.

Konda Surekha: మంత్రులందరిని కొండా సురేఖ ఇరికించారా? ఎందుకలా?

Konda Surekha

Updated On : May 17, 2025 / 9:07 PM IST

మంత్రి కొండా సురేఖ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారా? ఆమె తాజాగా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మంత్రులందరిని ఇరికించాయా? అసలు మంత్రి కొండా సురేఖ కావాలనే అలా అన్నారా? లేదంటే ఫ్లోలో అనేసి నాలుక్కరుచుకున్నారా? తరువాత ప్రభుత్వ పెద్దల సలహాతో..అబ్బే నేను అలా అనలేదని సురేఖ సర్ది చెప్పినా..అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ మాత్రం జరిగిపోయిందన్న చర్చ జరుగుతోంది.

ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టే విధంగా మాట్లాడే ఆమె..మనసులో ఉన్నమాటే చెప్పి ఉంటారనే టాక్ తెలంగాణ రాజకీయవర్గాల్లో విన్పిస్తోంది. ఫైల్ క్లియర్ కావాలంటే మంత్రులు డబ్బులు తీసుకుంటున్నారని .. బిల్లులు క్లియర్ చేయాలంటే కమిషన్ ఇవ్వాల్సిందేనంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలకు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు అస్త్రంగా మారాయి .. వరంగల్ లో మంత్రి చేసిన హాట్ కామెంట్స్ రేవంత్ సర్కార్ ను ఇరకాటంలోకి నెట్టాయన్న టాక్ విన్పిస్తోంది.

తాను అటవీశాఖ మంత్రిగా ఉన్నందున తన వద్దకు కొన్ని ఫైళ్లు వస్తాయని..ఇలాంటి వాటిని మంత్రులు డబ్బులు తీసుకుని క్లియర్ చేస్తారని..తాను మాత్రం అలా కాదని ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మంత్రులు ఫైళ్ల క్లియరెన్స్ కు లంచాలు తీసుకుంటారనే అభిప్రాయం ప్రజల్లోకి నేరుగా వెళ్లడంతో ప్రభుత్వ వర్గాల్లో కలకలం రేగింది.

Also Read: “అవును.. నిజమే”.. రావల్పిండి నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌పై భారత్‌ దాడులు చేసిందని అంగీకరించిన పాక్ ప్రధాని

మంత్రి కొండా సురేఖ ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారని సీఎం రేవంత్ సహా మంత్రులు ఆరా తీశారట. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కాదు..కమీషన్ ప్రభుత్వమని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న సమయంలో కొండా సురేఖ కామెంట్స్ వారి విమర్శలకు బలం చేకూర్చేలా ఉన్నాయని మంత్రులు వాపోయారని తెలుస్తోంది.

మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ ని అస్త్రంగా చేసుకుని రేవంత్ సర్కార్ పై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేటీఆర్, మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ కాంగ్రెస్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. దీంతో ఆమె మనసులో ఉన్న మాట చెప్పారా, లేదంటే ఫ్లోలో అలా అన్నారా అన్నది అర్ధంకాక మంత్రులు తలలు పట్టుకున్నారట. వెంటనే సీఎం రేవంత్ సూచనతో డ్యామేజ్ కంట్రోల్ కు దిగిన మంత్రి కొండా సురేఖ..తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందన్న టాక్
అబ్బే..తాను మాట్లాడింది బీఆర్ఎస్ ప్రభుత్వం లోని నాటి మంత్రుల గురించి అని సర్దిచెప్పుకున్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని, అలా తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. ఏ పనికైనా అప్పటి బీఆర్ఎస్ మంత్రులు డబ్బులు తీసుకునేవారనే ఉద్దేశంతో అలా చెప్పానని మంత్రి తెలిపారు. చెప్పాల్సిందంటా చెప్పేసి ఆ తరువాత నాలుక్కరుచుకున్నా.. లాభం లేదనే చర్చ జరుగుతోంది. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందన్న టాక్ కాంగ్రెస్ వర్గాల్లో విన్పిస్తోంది.

క్యాబినెట్ లోని మిగతా మంత్రులెవ్వరితో కొండా సురేఖకు అంత సఖ్యత లేదన్న టాక్ విన్పిస్తోంది. దీంతో వారంతా అంటీ ముట్టనట్లు ఆమెతో ఉండటంతో సందర్భం వచ్చింది కాబట్టి మనసులో మాట కావాలనే అలా చెప్పారనే టాక్ సచివాలయవర్గాల్లో వినిపిస్తోంది. ఐతే ఆ తరువాత ఆమె చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో స్పందించడంతో సీఎం రేవంత్ సహా మంత్రులంతా ఆలస్యంగా తేరుకొని..డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా ఆమెతో వివరణ ఇప్పించారని అంటున్నారు. కానీ..మంత్రులపై అభాండం వేసి..ఆ తర్వాత ఎంత సర్దిచెప్పుకున్నా జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయిందని, మంత్రులపై మచ్చ మాత్రం పడిపోయిందనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.

అయితే హాట్ కామెంట్స్ చేయడం మంత్రి కొండా సురేఖకు అలవాటే అన్న చర్చ సైతం రాజకీయవర్గాల్లో కొనసాగుతోంది. గతంలో అనేక సందర్భాల్లో ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను సైతం కొందరు నేతలు గుర్తుచేస్తున్నారు. గతంలో ఓ సినీ నటుడి కుటుంబాన్ని ఉద్దేశించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఆమె మంత్రి పదవికే ఎసరే తెచ్చేంత పనిచేశాయట. కేటీఆర్ ను విమర్శించే క్రమంలో సదరు సినీ నటుడి ఫ్యామిలీపై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.

ఓ దశలో కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తారన్న చర్చ సైతం జోరుగా జరిగింది. కానీ ఆమె బీసీ వర్గానికి చెందిన నేత కావడం, అందులోను మహిళా మంత్రి కావడంతో కాంగ్రెస్ అధిష్టానం చూసిచూడనట్లు వదిలేసిందన్న టాక్ వినిపించింది. అంతేకాదు మొన్నటికి మొన్న వేములవాడ దేవస్థాన గోశాలలో మంత్రి కొండా సురేఖ సిఫార్సుతో రాజన్న ఆలయ కోడెలు పక్కదారి పట్టాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. 49 కోడెలను రాంబాబు అనే వ్యక్తికి ఆలయ ఈవో అప్పగించారని, మంత్రి మెప్పు కోసం నిబంధనలకు విరుద్ధంగా కోడెలను అప్పగించించడం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది.

ఇలా నిత్యం తన వివాదాస్పద వ్యాఖ్యలతో దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ వార్తల్లో నిలుస్తున్నారు. అంతేకాదు నిన్న గాక మొన్న విశ్వ సుందరుల వరంగల్ పర్యటనలో మంత్రి హోదాలో తెలంగాణ జరూర్ ఆన అనే టూరిజం టాగ్ లైన్ ను కూడా సరిగా ఉచ్చరించకుండా సురేఖ చేసిన ప్రసంగం సైతం సోషల్ మీడియా లో వరాల్ గా మరి సర్కార్ ను ఇరకాటంలో నెట్టింది .. మొత్తానికి సురేఖ చేస్తున్న వ్యాఖ్యలు , ఆమె తీరు మాత్రం ఇటు ప్రభుత్వంలో, అటు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. మరి ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో ఇంకెన్ని రాజకీయ పరిణామాలకు దారితీస్తుందో అన్నది చూడాలి.