ఢిల్లీలో బీసీ ధర్నాపై కాంగ్రెస్ నేతల్లో ఆందోళన? ఎందుకంటే?

అసలు మనం చేస్తున్నది రైటా.. రాంగా అని కూడా సీక్రెట్‌గా చర్చించుకుంటున్నారట సదరు నేతలు.

ఢిల్లీలో బీసీ ధర్నాపై కాంగ్రెస్ నేతల్లో ఆందోళన? ఎందుకంటే?

Updated On : April 1, 2025 / 9:30 PM IST

బీసీ బిల్లు అంశంపై కాంగ్రెస్‌ తొందరపడుతుందా.. ఆగమేఘాల మీద ఢిల్లీలో ధర్నా చేయాల్సిన అవసరమేంటి? ఈ ప్రశ్నలు ఏ రాజకీయ విశ్లేషకులో, ఇతర పార్టీ నేతలో సంధిస్తున్నవి కాదు. కాంగ్రెస్ నేతలు స్వయంగా తమకు తాము సంధించుకుంటున్న ప్రశ్నలివి. అంతేకాదు ఈ ధర్నాతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న అనుమానాలు సైతం వ్యక్తం చేస్తున్నారు. అసలు ధర్నా విషయంలో కాంగ్రెస్ నేతలు ఎందుకు ఆలోచనలోపడ్డారు..

తెలంగాణ బీసీ మంత్రులు, నేతలు ఢిల్లీ జంతర్‌మంతర్‌ దగ్గర బీసీ ధర్నాకు పిలుపునిచ్చారు. బీసీల రిజర్వేషన్ల పెంపు బిల్లును పార్లమెంట్‌ ఆమోదించాలని ఢిల్లీ గడ్డపై నినదించే లక్ష్యంగా ఈ ధర్నా కొనసాగనుంది. సీఎం రేవంత్ రె డ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్‌ కూడా ధర్నాలో పాల్గొననున్నారు. ఐతే కొందరు కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ బీసీ ధర్నా విషయంలో ఏమైనా తొందరపడుతున్నామా అనే డౌట్ వ్యక్తం చేస్తున్నారట కాంగ్రెస్ నేతలు.

విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. ఈ అంశాన్ని కేంద్రం 9వ షెడ్యూల్‌లో పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఐతే తెలంగాణ అసెంబ్లీ తీర్మానానికి ఇంకా చట్టబద్ధత కల్పించాల్సి ఉంది. బీసీ రిజర్వేషన్ల బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేయాల్సి ఉంది.

దీనిపై క్లారిటీ లేదు..
గవర్నర్ ఆమోదం తర్వాత ఈ బిల్లులు చట్టంగా మారుతాయి. అయితే ఈ బిల్లులకు గవర్నర్ ఎప్పుడు ఆమోదం తెలుపుతారన్నదానిపై క్లారిటీ లేదు. న్యాయపరమైన అంశాలన్నింటిని పరిశీలించిన తర్వాతే గవర్నర్ బీసీ రిజర్వేషన్ల బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత అప్పుడు చట్టంగా మారుతుంది. ఆ విషయాన్ని అధికారికంగా కేంద్ర ప్రభుత్వానికి తెలియాజేయాల్సి ఉంటుంది. బీసీ రిజర్వేషన్ల బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందన్న అంశంతో పాటు గవర్నర్ ఆమోదించిన చట్టాన్ని కేంద్ర సర్కార్‌కు పంపించాలి.

రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో పొందుపరచాలని ప్రతిపాదన చేయాలి. ఇప్పటి వరకు అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లులు ఆమోదం పొందడం తప్పా మిగతా ప్రొసిజర్ ఏమీ జరగలేదు. ఇవన్నీ జరిగాక.. కేంద్రం సానుకూలంగా స్పందించికపోతే అప్పుడు యాక్షన్ మొదలుపెట్టాలి.

కానీ ఇవేమీ జరగకుండానే ఢిల్లీలో ధర్నా చేస్తే ప్రజల్లోకి తప్పుడు మెస్సేజ్ వెళ్తుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట కాంగ్రెస్ నేతలు. అసలు మనం చేస్తున్నది రైటా.. రాంగా అని కూడా సీక్రెట్‌గా చర్చించుకుంటున్నారట సదరు నేతలు. బీసీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి ప్రయత్నంపై అనుమానాలు తలెత్తే ప్రమాదం లేకపోలేదనేది వారి వాదనగా తెలుస్తోంది. ఏదీ ఏమైనా.. ఢిల్లీ గడ్డపై బీసీ గళం వినిపించేందుకు తెలంగాణ బీసీ నేతలు కదం తొక్కడంపై ఎన్డీఏ సర్కార్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి..