గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి పవన్ ప్రచారం.. టీఆర్ఎస్, సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తారా

  • Published By: naveen ,Published On : November 20, 2020 / 05:46 PM IST
గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి పవన్ ప్రచారం.. టీఆర్ఎస్, సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తారా

Updated On : November 20, 2020 / 6:09 PM IST

pawan kalyan ghmc elections: గ్రేటర్‌ ఎన్నికల బరి నుంచి జనసేన తప్పుకుంది. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు జనసేనాని పవన్‌ కల్యాణ్‌ స్వయంగా ప్రకటించారు. అంతేకాదు గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మద్దతు ప్రకటించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేయనున్నారు పవన్‌ కల్యాణ్‌. బీజేపీతో కలసి పోటీపై మొదట్లో కాస్త గందరగోళం నెలకొందన్నారు పవన్‌.

కాగా, పొత్తులపై బండి సంజయ్‌తో చర్చించనున్నట్లు నిన్న(నవంబర్ 19,2020) జనసేన ప్రకటించింది. అయితే జనసేనకు సీట్లు ఇచ్చేందుకు బండి సంజయ్‌ సుముఖత వ్యక్తం చేయలేదు. ఇవాళ(నవంబర్ 20,2020) పవన్‌తో కిషన్‌ రెడ్డి, లక్ష్మణ్‌ చర్చలు జరిపారు. బీజేపీ నేతల మంతనాలతో పవన్ మెత్తబడ్డారు. గ్రేటర్ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు పవన్. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి కృషి చేస్తామన్నారు పవన్. అయితే టీఆర్‌ఎస్‌పైన కానీ ప్రభుత్వంపైన కానీ విమర్శలు చేయకుండా ఆచితూచి మాట్లాడారు పవన్‌.

ప్రధాని మోదీ నాయకత్వంలోనే హైదరాబాద్‌ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతుందన్నారు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌. గ్రేటర్‌ ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీ గెలవాలన్నారు. బీజేపీ గెలుపునకు జనసేన పూర్తి స్థాయి మద్దతిస్తుందని జనసేనాని తెలిపారు.