Today Headlines: డిసెంబర్ 9 నుంచే.. కాంగ్రెస్ 2 గ్యారెంటీలు అమలు

కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీని ఎన్టీఆర్ స్థాపిస్తే.. ఇప్పుడు గాంధీ భవన్ ముందు ఆ పార్టీ సన్నాసులు గెంతులేస్తున్నారని దుయ్యబట్టారు.

Today Headlines: డిసెంబర్ 9 నుంచే.. కాంగ్రెస్ 2 గ్యారెంటీలు అమలు

11PM Headlines

రెండు గ్యారెంటీలకు కేబినెట్ ఓకే.. 
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలపై మొదటి కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేబినెట్ నిర్ణయాల గురించి తెలియజేశారు. ఈ సమావేశంలో రెండు గ్యారెంటీలపై చర్చ జరిగిందని, వాటిని సోనియా గాంధీ పుట్టినరోజైన డిసెంబర్ 9 నుంచి అమలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

గాంధీ భవన్ ముందు టీడీపీ సన్నాసుల గెంతులు: కొడాలి నాని
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం అనంతరం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు కొందరు గాంధీ భవన్ వచ్చి సంబరం చేసుకున్నారు. టీడీపీ జెండాలతో రేవంత్ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. అయితే దీనిపై వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీని ఎన్టీఆర్ స్థాపిస్తే.. ఇప్పుడు గాంధీ భవన్ ముందు ఆ పార్టీ సన్నాసులు గెంతులేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.

నోట్ల కట్టలు
ఒడిశా డిస్టిల్లరీస్‌ కంపెనీపై ఐటీ అధికారుల దాడులు చేశారు. ఆ కంపెనీ నుంచి సుమారు 50 కోట్ల రూపాయల కరెన్సీని సీజ్ చేశారు.

వరదలపై రివ్యూ
వరదలు పోటెత్తిన తమిళనాడు రాష్ట్రంలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ముంపుకు గురైన ప్రాంతాల్లో పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో ప్రత్యేకంగా సమావేశమై జరిగిన నష్టంపై సమీక్షించారు.

సచివాలయానికి చేరుకున్న రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం సచివాలయానికి చేరుకున్నారు. ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే ఏఐసీసీ సీనియర్ నాయకులతో సమావేశం ముగించుకుని, అటు నుంచి నేరుగా రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయడానికి రేవంత్ సొంత కారులోనే వచ్చారు. ఆ కారుకే పోలీస్ ఎస్కార్ట్ ఏర్పాటు చేశారు.

మొదటి క్యాబినెట్ మీట్
నూతనంగా ఏర్పడిన తెలంగాణ కేబినెట్ సాయంత్రం ఐదు గంటలకు సచివాలయంలో సమావేశం కానుంది. మంత్రివర్గ ప్రమాణ స్వీకారం తర్వాత అవుతున్న మొట్టమొదటి క్యాబెనెట్ మీటింగ్ ఇదే.

ప్రగతి సంతకం
ఆరు గ్యారంటీలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి సంతకం చేశారు. క్యాబినెట్ మీటింగులో గ్యారెంటీల అమలుపై చర్చ జరగనుంది. కాగా, దివ్యాంగురాలు రజనికి ఉద్యోగం ఇస్తూ రెండో సంతకం చేశారు.

పాలకులం కాదు సేవకులం
ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ వేదిక నుంచి మీకు మాట ఇస్తున్నా..ప్రగతి భవన్ లో రేపు ఉదయం 10గంటలకు జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో ప్రజా దర్భార్ నిర్వహిస్తామని సీఎం రేవంత్ తెలిపారు. తెలంగాణ ప్రజల హక్కులను కాపాడేందుకు ప్రజా భవన్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో నిస్సహాయులకు ఎవ్వరు లేరనే భావన లేకుండా వారికి అండగా ప్రభుత్వం ఉంటుందన్నారు. మీ సోదరుడిగా.. మీ బిడ్డగా మాట ఇస్తున్నా.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎప్పుడు నిలబడి ఉంటామని..తాము పాలకులం కాదు సేవకులం అని ..మీకు సేవల చేసేందుకు మాకు ఇచ్చి అవకాశంగా భావిస్తున్నామన్నారు. మీకు మాకు ఇచ్చిన అవకాశాన్ని అధికారంగా కాకుండా బాధ్యతగా భావిస్తామని హామీ ఇచ్చారు.
తొలి కాంగ్రెస్ ప్రభుత్వం..
తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరింది. సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్కతో పాటు 11మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు.

ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను..
తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై రేవంత్ చే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. కాంగ్రెస్ శ్రేణుల హర్షధ్వానాల మధ్య తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. 1.21 నిమిషాలకు రేవంత్ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం అనంతరం రేవంత్ కు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు.
డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క..
సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఆ తరువాత డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క ప్రమాణస్వీకారం చేశారు.

రేవంత్ రెడ్డి మంత్రులుగా 11మంది
మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి,దామోదర రాజనరసింహ,కోమటిరెడ్డి వెంటక రెడ్డి,దుద్దిళ్ల శ్రీధర్ బాబు,పొంగులేటి శ్రీనివాస రెడ్డి,పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ,డి.దనసరి అనసూయ అలియాస్ సీతక్క,జూపల్లి కృష్ణారావు,తుమ్మల నాగేశ్వరరావు మొత్తం 11మంది ప్రమాణస్వీకారం చేశారు.
ఆరు గ్యారెంటీ
తెలంగాణలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలుచేస్తామని రాహుల్ గాంధీ మరోసారి స్పష్టంచేశారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న రేవంత్ కు రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. అదే సమయంలో ఆరు గ్యారెంటీలుఅమలు చేస్తామని హామీ ఇచ్చారు.

ఫలితాలు వచ్చేశాయ్..
ఏపీ ఎస్ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆన్ లైన్ లో విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 411 పోస్టులకుగాను ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా.. 57,923 మంది అర్హత సాధించిన విషయం తెలిసిందే. వీరిలో 31,193 తుది పరీక్షరాశారు. తుది రాత పరీక్ష నాలుగు పేపర్లకు నిర్వహించిన అధికారులు తాజాగా ఫలితాలు వెలువరించారు.
నేలపాలు ..
మిగ్‌జామ్‌ తుపాను కారణంగా తెలంగాణలో వేలాది ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది.

ట్రాఫిక్ ఆంక్షలు ..
రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 1.04గంటలకు ఎల్బీ స్టేడియంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసులు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పబ్లిక్ గార్డెన్ నుండి బషీర్ బాగ్ వెళ్లే రోడ్డు మూసివేయనున్నట్లు సిటీ పోలీసులు తెలిపారు. ఈ మార్గాన్ని గన్ పౌండ్రీ నుండి చాపెల్ రోడ్డు మీదగా మళ్లించినట్లు తెలిపారు. బషీర్ బాగ్ నుండి వచ్చే వాహనాలను కింగ్ కోటి సైడ్ మళ్లిస్తున్నట్లు వెల్లడించారు. సుజాత స్కూల్ మీదుగా వచ్చే వాహనాలను నాంపల్లి రైల్వే స్టేషన్ మీదుగా మళ్లిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మార్గాలవైపు వెళ్లే వాహనదారులు ప్రత్యమ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించారు.
రైళ్లు రద్దు..
మిగ్ జామ్ తుపాను ప్రభావం నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో బుధవారం 14 రైళ్లు రద్దయ్యాయి. వీటిలో చెన్నై సెంట్రల్ – హైదరాబాద్ (12603), రేపల్లె – సికింద్రాబాద్ (17646) ఉన్నాయి. హైదరాబాద్ – చెన్నై సెంట్రల్ (12604) ఎక్స్ ప్రెస్ ను గురువారం రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. మరోవైపు నిర్వహణపరమైన కారణాలతో అదిలాబాద్ -హెచ్ఎస్ నాందేడ్ (17409) రైలును గురువారం రద్దు చేశారు.

నేడు మోస్తారు వర్షాలు..
మిగ్ జామ్ తుపాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో గురువారం అదిలాబాద్, కుమురం భీం, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల ( గంటలకు 30-40 కిలో మీటర్ల వేగం)తో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.