రోడ్డుపై వెళ్తున్నవారిపై ఆవు దాడి.. ఒకరు మృతి, పలువురికి తీవ్ర గాయాలు

రోడ్డుపై వెళ్తున్నవారిపై ఆవు దాడి.. ఒకరు మృతి, పలువురికి తీవ్ర గాయాలు

Updated On : January 28, 2021 / 11:51 AM IST

Cow attack .. One killed : హైదరాబాద్‌ పహాడీషరీఫ్‌లో ఓ ఆవు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న పలువురిపై దాడి చేసింది. ఈ సంఘటనలో ఖాజా అనే వ్యక్తి మృతి చెందాడు. కాలినడకన కర్ర సహాయంతో ఖాజా అనే వ్యక్తి ఇంటికి చేరుకుంటున్న సమయంలో… ఉన్నట్టుండి అతడిపై ఆవు దాడి చేసింది. వృద్ధుడిని పైకి లేపి కిందపడేసింది. ఆ తర్వాత అక్కడే పనిచేస్తోన్న ఇద్దరు మున్సిపల్ కార్మికులు, మరో ఇద్దరు స్థానికులను వెంటాడింది.

సంఘటనా స్థలంలో పడి వున్న ఖాజాను ఆసుపత్రికి తరలిస్తుండగా… మార్గమధ్యలోనే అతడు మృతి చెందాడు. ఆవు దాడిలో మరో ఉద్యోగి నడుం విరిగి, ఆసుపత్రి పాలయ్యాడు. మరికొందరికి స్వల్పగాయాలయ్యాయి. ఆవును కుక్క కరవడంతో రేబిస్‌ వ్యాధికి గురై, మనుషులపై దాడి చేసిందని పశువుల వైద్యులంటున్నారు.

యువకులు కర్రలతో వెంట పడటంతో ఆవు సుల్తాన్‌పూర్‌ ఇస్తెమా కొండల్లోకి వెళ్లిపోయింది. కలెక్టర్‌ ఆదేశాలతో పహాడీ షరీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌, మున్సిపల్ కమిషనర్‌ తమ సిబ్బందితో ఆవును బంధించేందుకు ప్రయత్నించారు. రెస్క్యూ టీమ్‌ను రంగంలోకి దింపారు. అయితే జూపార్క్‌ సిబ్బందిపై ఆవుదాడి చేయడంతో వారు సైతం గాయాలపాలయ్యారు.

చివరకు జల్పల్లి మున్సిపాలిటీ, అటవీశాఖ అధికారులు, స్థానిక పోలీసులు ఆవుకు మత్తు సూదులను గుచ్చి బంధించారు. ఆ తర్వాత జియాగూడ గోశాలకు ఆవును తరలించడంతో… అటు అధికారులు, ఇటు స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.

ఆవుదాడిలో చనిపోయిన ఖాజా వృత్తిరీత్యా ఒకప్పుడు లారీ డ్రైవర్‌. గతంలో దివంగత సీఎం ఎన్టీఆర్ హయాంలో శిల్పులు చెక్కిన గౌతమ బుద్దుని విగ్రహాన్ని పెద్దపాటి ట్రక్కులో ఏ మాత్రం చెక్కుచెదరకుండా హుస్సేన్‌సాగర్‌ నీటి ఒడ్డు వరకు తీసుకెళ్లడంతో… ఎన్టీఆర్‌తో ప్రత్యేక ప్రశంసలు పొందారు. ఖాజా మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.