Delhi : ఢిల్లీలో ఏరియాలకు పేర్లు మార్పు.. బీజేపీ సూచించిన కొత్త పేర్లు ఇవే
ఇది ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానం, దానిని నెరవేర్చడానికి మేము కట్టుబడి ఉన్నాము.

Delhi : ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 27ఏళ్ల తర్వాత హస్తినలో కమలం పార్టీ అధికారంలోకి రావడం విశేషం. బీజేపీ ప్రభుత్వం వచ్చిందో లేదో అప్పుడే మార్పులు మొదలయ్యాయి. తాజాగా ఢిల్లీలో ఏరియాల పేర్లు మార్చాలనే డిమాండ్ ను తెరపైకి తెచ్చారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు. ఢిల్లీలోని నజఫ్ ఘర్ ను నహర్ ఘర్ గా, మహమ్మద్ పూర్ ను మాధవపురంగా, ముస్తఫాబాద్ ను శివ్ విహార్ గా పేర్లు మార్చాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
దేశంలోని పలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పలు నగరాల పేర్లు మార్చిన సంగతి తెలిసిందే. యూపీలో అలహాబాద్ ఇప్పుడు ప్రయాగ్ రాజ్ అయ్యింది. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల్లో ఇదే తరహా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రధానంగా మొఘల్ పాలకులతో సంబంధం ఉన్న పేర్లను మార్చాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
సౌత్ ఢిల్లీ నియోజకవర్గంలోని మహమ్మద్ పూర్ పేరుని ఆర్కే పురంగా మార్చాలని అనిల్ శర్మ డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి సభలో ప్రతిపాదన పెడతానని ఆయన చెప్పారు. పేరు మార్పునకు సంబంధించి ప్రజలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారని ఆయన అన్నారు. చాలా రోజుల క్రితమే మహ్మద్ పూర్ పేరు మార్చాలని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదన పెట్టింది. అయితే, గత ఆప్ ప్రభుత్వం ఆ డిమాండ్ ను పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం వచ్చిందని, పేరు మార్పునకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అనిల్ శర్మ చెప్పారు.
Also Read : అమెరికా బంగారం నిజంగానే మాయమైతే దాని ప్రభావం మనపై ఎలా పడుతుంది? ఫోర్ట్ నాక్స్ ఆడిట్ జరిగితే ఏమవుతుంది?
ఇక తన నియోజకవర్గం నజఫ్ ఘర్ పేరుని నహర్ ఘర్ గా మార్చాలని నీలమ్ పెహల్వాన్ డిమాండ్ చేశారు. ”మొఘల్ చక్రవర్తి షా ఆలం II నజఫ్‌గర్ ను తన ఆధీనంలోకి తీసుకున్నప్పుడు ప్రజలు వ్యతిరేకించారు. నజాఫ్ ఖాన్ ఈ ప్రాంతానికి గవర్నర్‌గా నియమితులయ్యారు. అప్పటి నుండి ఈ ప్రాంతాన్ని నజాఫ్‌గర్ అని పిలుస్తారు.
1857 తిరుగుబాటు సమయంలో, రాజా నహర్ సింగ్ పోరాడి ఈ ప్రాంతాన్ని ఢిల్లీ ప్రావిన్స్‌లోకి తెచ్చారు” అని నీలమ్ తెలిపారు. నగర్ సింగ్ పేరును ఆ ప్రాంతానికి పెడితేనే ఆయనకు నిజంగా గౌరవం లభిస్తుందని అన్నారు. నజఫ్‌గర్ ప్రజలు అణచివేతకు గురవుతున్నందున వారు మారాలని కోరుకుంటున్నారని, పేరు మార్చడం వారికి చాలా ముఖ్యమైనదని వెల్లడించారు.
ఢిల్లీ మంత్రి పర్వేశ్ వర్మ.. పహల్ వాన్ డిమాండ్ ను సమర్థించారు. పేరు మార్పు చాలా కాలం నుంచి వినిపిస్తున్న డిమాండ్ అని అన్నారు. నజఫ్ గర్ గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన లోక్ సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుందని, అందుకే పేరు మార్పు ఐడియాను తాను సమర్థించానని పర్వేశ్ వర్మ చెప్పారు.
ఇక, డిప్యూటీ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నిక కానున్న మోహన్ సింగ్ బిస్త్.. సైతం ఇలాంటి డిమాండ్ ను తీసుకొచ్చారు. తన నియోజకవర్గం ముస్తఫాబాద్‌ను శివ విహార్‌గా మారుస్తామని చెప్పారు. “ఇది ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానం, దానిని నెరవేర్చడానికి మేము కట్టుబడి ఉన్నాము. ముస్తఫాబాద్ అనే అసెంబ్లీ నియోజకవర్గంలోని ఏరియా మారదు” అని బిస్త్ చెప్పారు.