Hyderabad CP Sumathi : అర్ధరాత్రి మహిళా పోలీస్ కమిషనర్ కు వేధింపులు.. 40 మంది పోకిరీలు చుట్టుముట్టి.. పత్తాలేని పెట్రోలింగ్ పోలీసులు
Hyderabad CP Sumathi : హైదరాబాద్ మహిళా పోలీస్ కమిషనర్ సుమతి తాజాగా మంగళవారం అర్థరాత్రి సంచలన ఆపరేషన్ నిర్వహించారు. అది కూడా ఒక్కరే.
hyderabad woman cp sumathi midnight under cover operation at dilsukhnagar bus stop
Hyderabad CP Sumathi : హైదరాబాద్ మహానగరంలో మహిళల రక్షణ కోసం ప్రభుత్వం, పోలీసులు కీలక చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ నగర మహిళా పోలీస్ కమిషనర్ సుమతి స్వయంగా ఫీల్డ్‌లోకి దిగి నిర్వహించిన సీక్రెట్ ఆపరేషన్ సంచలనంగా మారింది. కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే ఆమె దిల్సుఖ్నగర్ బస్టాండ్ ప్రాంతంలో మహిళలకు ఎదురవుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు మే 5, మంగళవారం అర్ధరాత్రి ఈ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టారు.
అర్థరాత్రి ఆపరేషన్
హైదరాబాద్ మహిళా పోలీస్ కమిషనర్ సుమతి.. బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే అరాచకాలకు అడ్డాగా మారిన దిల్సుఖ్నగర్ బస్టాండ్‌కు అర్ధరాత్రి ఒంటరిగా, ఎలాంటి సెక్యూరిటీ లేకుండా వెళ్లారు. మహిళా కమిషనర్‌గా కాకుండా.. ఒక సగటు మహిళగా బస్టాండ్‌లో బస్సు కోసం నిల్చున్నారు సుమతి. అయితే ఆమె కమిషనర్ అని తెలియక.. సగటు మహిళను ఎలా ఇబ్బందులకు గురి చేస్తారో, అలానే సుమతిని కూడా వేధించారు పోకిరీలు. ఈ ఆపరేషన్‌లో ఆమె సగటు మహిళకు ఎదురయ్యే వేధింపులను స్వయంగా ఎదుర్కొన్నారు.
40 మంది పోకిరీల వేధింపులు
బస్సు కోసం ఎదురు చూస్తున్న సుమతిని సుమారు 40 మంది పోకిరీలు చుట్టుముట్టి ఇబ్బంది పెట్టారు. రకరకాల అసభ్య ప్రశ్నలతో ఆమెను వేధించారు. అర్ధరాత్రి 12 నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు సుమతి ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఆమెను చుట్టుముట్టిన పోకిరీల్లో ఎక్కువ మంది విద్యార్థులే కావడం గమనార్హం. అందులోనూ మద్యం మత్తు, గంజాయి మత్తులో ఉన్న యువకులే అధికంగా ఉన్నారు. 3 గంటల పాటు పెట్రోలింగ్ పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు.
అయినా సరే మొక్కవోని ధైర్యంతో సుమతి అక్కడే ఉండి అందరినీ గమనించారు. చివరికి తెల్లవారుజామున 3:30 గంటలకు అటువైపుగా ఒక బీట్ కానిస్టేబుల్ వచ్చాడు. దీంతో పోకిరీలు అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేయగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, కౌన్సిలింగ్ నిర్వహించి పంపించారు.
మూడు రోజుల పాటు నిఘా
దిల్సుఖ్నగర్ బస్టాండ్ ప్రాంతంలో మహిళల భద్రతపై వరుస ఫిర్యాదులు రావడంతో కమిషనర్ సుమతి మూడు రోజుల పాటు స్వయంగా నిఘా పెట్టినట్లు సమాచారం. ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో అనుమానాస్పదంగా తిరిగేవారిని గుర్తించడం, మహిళలను వేధించే యువకులపై నిఘా, రాత్రివేళల్లో భద్రతా పరిస్థితుల పరిశీలన చేపట్టారు.
దిల్సుఖ్నగర్ ప్రాంతంలో అధిక సంఖ్యలో హాస్టల్స్ ఉండటంతో రాత్రి వేళల్లో యువకుల సంచారం ఎక్కువగా ఉంటోందని పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా కోచింగ్ సెంటర్లు, ప్రైవేట్ హాస్టల్స్, విద్యార్థుల నివాసాలు ఎక్కువగా ఉండటంతో రాత్రి సమయంలో అల్లరి మూకల ఆగడాలు పెరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
