India Vs South Africa 1st Test : సఫారీ జట్టుతో తొలి టెస్ట్.. 31ఏళ్ల చరిత్రను రోహిత్ సేన తిరగరాస్తుందా?

భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య మొత్తం 15 ద్వైపాక్షిక టెస్టు సిరీస్ లు జరిగాయి. ఇందులో భారత్ నాలుగు సిరీస్ లలో మాత్రమే విజయం సాధించగా.. ఎనిమిది సిరీస్ లలో ఓడిపోయింది.

India Vs South Africa 1st Test : సఫారీ జట్టుతో తొలి టెస్ట్.. 31ఏళ్ల చరిత్రను రోహిత్ సేన తిరగరాస్తుందా?

Rohit sharma

Updated On : December 26, 2023 / 9:31 AM IST

IND vs SA Test Series : భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇవాళ్టి నుంచి తొలి టెస్ట్ ప్రారంభమవుతుంది. టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇరు జట్లు రెండు టెస్టుల్లో తలపడనున్నాయి. మొదటి టెస్టు ఇవాళ్టి నుంచి 30వ తేదీ వరకు జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు సెంచూరియన్ లో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే, ఈ సిరీస్ లో చరిత్ర తిరగరాసేందుకు రోహిత్ సేన సిద్ధమవుతోంది. భారత జట్టు తన చరిత్రలో దక్షిణాఫ్రికా గడ్డపై ఒక్క ద్వైపాక్షిక టెస్టు సిరీస్ ను కూడా గెలవలేదు. 1992 నుంచి దక్షిణాఫ్రికాలో భారత్ జట్టు ద్వైపాక్షిక టెస్టు సిరీస్ లు ఆడుతుంది. కానీ, ఇప్పటి వరకు ఒక్కసారికూడా సిరీస్ ను గెలవలేక పోయింది.

Also Read : IND vs SA : ద‌క్షిణాఫ్రికాతో మొద‌టి టెస్టుకు ముందు బ్యాడ్‌న్యూస్‌.. ఇక భార‌త‌ బ్యాట‌ర్ల‌కు క‌ష్ట‌కాల‌మే..!

భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య మొత్తం 15 ద్వైపాక్షిక టెస్టు సిరీస్ లు జరిగాయి. ఇందులో భారత్ నాలుగు సిరీస్ లలో మాత్రమే విజయం సాధించగా.. ఎనిమిది సిరీస్ లలో ఓడిపోయింది. మూడు డ్రాలు అయ్యాయి. అయితే, దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన టెస్ట్ సిరీస్ లలో భారత్ జట్టు ఒక్కటి కూడా గెలుచుకోలేదు. దక్షిణాఫ్రికా గడ్డపై భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మొత్తం ఎనిమిది ద్వైపాక్షిక టెస్టు సిరీస్ లు జరిగాయి. ఇందులో ఏడు సిరీస్ లలో భారత్ జట్టు ఓడిపోగా.. ఒక్క సిరీస్ ను మాత్రమే డ్రాగా ముగించింది. ఈసారి దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ ను కైవసం చేసుకొని 31ఏళ్ల నిరీక్షణకు తెరదించేందుకు భారత్ జట్టు సిద్ధమైంది. మరి రోహిత్ సేన ప్రయత్నాలు ఏమేరకు సఫలం అవుతాయో వేచి చూడాల్సిందే.

Also Read : IND vs AUS : ఆస్ట్రేలియాతో వ‌న్డే, టీ20 సిరీస్‌.. భార‌త మ‌హిళ‌ల జ‌ట్లు ఇవే..

వన్డే ప్రపంచ కప్ గెలుచుకొని కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోనీల సరసన నిలిచే అవకాశాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ తృటిలో కోల్పోయారు. అయితే, ఇప్పుడు దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ ను గెలిచిన తొలి భారత్ కెప్టెన్ గా అవతరించే అవకాశం రోహిత్ శర్మ ముందుంది. ఈ అవకాశాన్ని రోహిత్ ఎలా సద్వినియోగం చేసుకుంటాడో వేచిచూడాల్సిందే. మహ్మద్ అజారుద్దీన్ (1992), సచిన్ టెండూల్కర్ (1996), సౌరవ్ గంగూలీ (2001) కెప్టెన్సీలో దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ లో భారత్ జట్టు విఫలమైంది. రాహుల్ ద్రవిడ్ (2006-07), ధోనీ (2010-11 , 2013-14), విరాట్ కోహ్లీ (2018-19, 2021-22) కెప్టెన్సీలో టెస్టు మ్యాచ్ లు గెలిచినా టెస్టు సిరీస్ ను గెలుచుకోలేక పోయారు. ప్రస్తుతం రోహిత్ తన కెప్టెన్సీలో సిరీస్ ను కైవసం చేసుకొని చరిత్ర సృష్టిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.