రాత్రి 8గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం.. ఆపరేషన్ సిందూర్ గురించి ఏం చెబుతారోనన్న ఉత్కంఠ..
ఇకపై దేశంపై జరిగే ఉగ్రదాడులను యుద్ధంగానే పరిగణించే అవకాశం ఉంది.

PM Modi
జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ఇవాళ రాత్రి 8 గంటలకు ఆయన మాట్లాడతారు. పాకిస్థాన్, పీవోకేలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆయన ప్రసంగిస్తుండడం గమనార్హం. ఆపరేషన్ సిందూర్ గురించి మోదీ ఏం చెబుతారోనన్న ఉత్కంఠ నెలకొంది.
పాకిస్థాన్‌కు భారత్ ఇటీవల వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. భవిష్యత్తులో ఏదైనా ఉగ్రవాద చర్యలకు పాల్పడితే భారత్‌పై యుద్ధ చర్యకు పాల్పడ్డట్టుగానే పరిగణించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు మీడియాకు తెలిపాయి. దీంతో ఇకపై దేశంపై జరిగే ఉగ్రదాడులను యుద్ధంగానే పరిగణించే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగానే మన దేశ ప్రతిస్పందన ఉంటుంది.
Also Read: డోంట్ వర్రీ.. దేశం కోసం 10 శాటిలైట్లు సెకన్ రెస్ట్ కూడా లేకుండా నిఘా: ఇస్రో
మరోవైపు, భారత్, పాకిస్థాన్ మధ్య డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) స్థాయి చర్చలు ఇవాళ సాయంత్రం జరగనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. డీజీఎంవోలు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు చర్చలు జరపాల్సి ఉండగా అది వాయిదా పడింది. ఈ చర్చలు జరగకముందే ఆదివారం డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ ఆపరేషన్ సిందూర్ గురించి మరిన్ని వివరాలు తెలిపారు.
మరోవైపు, కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత కూడా పాకిస్థాన్ సైన్యం సరిహద్దుల వెంబటి కాల్పులు జరిపింది. డ్రోన్లను కూడా పంపుతూ దుందుడుకు చర్యలకు పాల్పడింది. ఇటువంటివి పునరావృతం అయితే తీవ్రంగా స్పందిస్తామని భారత్ స్పష్టం చేసింది.