Raghunandan Rao: మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాల్
కొత్త ప్రభాకర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తే తాను కూడా రాజీనామా చేసి.. ఎన్నికలు ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నానని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రకటించారు.

Raghunandan Rao
Raghunandan Rao Challenge: మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి (Kotha Prabhakar Reddy) దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాల్ విసిరారు. కొత్త ప్రభాకర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తే తాను కూడా రాజీనామా చేసి.. ఎన్నికలు ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. బీసీ లందరికీ బీసీ బంధు (BC Bandhu) ఇవ్వాలనే డిమాండ్ తో దుబ్బాక మండలం హబ్సీపూర్ చౌరస్తా వద్ద బీజేపీ (BJP Telangana) ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆదివారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మెదక్ ఎంపీకి సవాల్ విసిరారు. బీసీలందరికీ బీసీబంధు ఇచ్చేదాక తమ పోరాటం ఆగదన్నారు.
పోలీసులు తమ ధర్నాను అడ్డుకోవడంపై స్పందిస్తూ.. ”కావాలని బీజేపీ ధర్నాను ఫెయిల్ చేస్తామనుకుంటే మేము ఊరుకోం. కొత్తగా వచ్చిన భూంపల్లి, దుబ్బాక ఎస్ఐలు, పోలీసోల్లు ఉషారు చూపిస్తున్నారు. మీ హద్దు దాటి ప్రవర్తిస్తే సహించం.. మేంటో చూపిస్తాం. మీ కేసులకు భయపడేది లేదు.. మాకు కూడా తెలుసు కేసులు ఎలా పెట్టాలో. మంత్రుల కారు డోర్లు తీసే ఎస్సై, సీఐలకు భయపడేది లేదు.
ఎన్నికలు వస్తే మత్స్యకారులకు ఐడీ కార్డులు ఇచ్చుడు కాదు.. మల్లన్నసాగర్ ప్రాజెక్టులో చేపల పెంపకానికి మత్స్యకారులకు అవకాశం ఇవ్వండి. సామరస్యంగా మా ధర్నా ముగిస్తామనుకున్నాం.. కానీ పోలీసుల అత్యుత్సాహం వలన ధర్నా కొనసాగిస్తున్నాం. అవసరమైతే ఈరోజు ఇక్కడే వంటావార్పు కూడా చేపడతామ”ని రఘునందన్ రావు అన్నారు.