తూర్పుగోదావరిలో బోటు మునక : 29 మంది తెలంగాణ వాసులు!

తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. గోదావరిలో పర్యాటకుల బోటు మునిగిపోయిందనే వార్త తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర ఈ ఘోరం చోటు చేసుకుంది. 24 మందిని NDRF బృందాలు రక్షించాయి. మృతుల సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందినట్లు సమాచారం. గల్లంతైన వారి కోసం గాలింపులు కొనసాగుతున్నాయి. ఈ బోటుకు అనుమతి లేదని అధికారులు అంటున్నారు.
సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం ఉదయం పాపికొండలకు వశిష్ట బోటు బయలుదేరింది. ఉదయం 10.30గంటలకు పోచమ్మ గండి నుంచి బయలుదేరిన ఈ బోటులో 51 మంది ప్రయాణీకులు, 11 మంది సిబ్బంది ఉన్నారు. కచ్చులూరు వద్ద గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. వెనక్కి తీస్తుండగా రాయికి తగిలి బోటు తిరగబడినట్లు సమాచారం.
బోటులో ఉన్న వారిలో 12 మంది హైదరాబాద్ వాసులు, 17 మంది వరంగల్ వాసులు, ముగ్గురు విజయవాడ వాసులున్నట్లు తెలుస్తోంది. విశాఖ, రాజమహేంద్రవరానికి చెందిన 30 మంది ఉన్నారని సమాచారం. ప్రమాదం నుంచి బయటపడిన వారిని రంపచోడవరం ఆస్పత్రికి తరలించారు.
గల్లంతైన వారు : గాంధీ, జగన్నాథం, లక్ష్మణ్, మహేశ్వరరావు, రమణ, జానకీ రామ్, దశరథం, జగదీశ్, మధు, విశాల్