వైఎస్ఆర్ పెళ్లి కానుక: రూ.లక్షకు పెంపు.. పూర్తి వివరాలు ఇవే

ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోయి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పలు సంక్షేమ పథకాల పేర్లలో మార్పులు చేస్తుంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ, పెన్షన్ స్కీమ్ ల పేర్లు మార్చిన జగన్ ప్రభుత్వం మరో కీలకమైన పథకం పేరు మార్చి ఇచ్చే డబ్బును కూడా పెంచేశారు. ఎన్నికల హామీలో భాగంగా నవరత్నాలలో జగన్ ప్రకటించిన ”వైఎస్ఆర్ పెళ్లి కానుక” పథకానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. అంతేకాదు టీడీపీ ప్రభుత్వం చంద్రన్న పెళ్లి కానుక పేరుతో ఇచ్చిన లబ్ధిని కూడా రెట్టింపు చేసింది.
ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే భారంగా మారిన పేద కుటుంబాలకు అండగా ఉండేందుకు.. పెళ్లికి బంగారు తాళిబొట్టు, నూతన వస్త్రాలు, భోజనాలు, పెళ్లి మండపం, పెళ్లి భజంత్రీలు అన్నింటికీ కనీసం లక్ష అవుతుందనే ఆలోచనతో.. పెళ్లి చేసుకునే అక్క చెల్లమ్మలకు అక్షరాల రూ.లక్ష ఇవ్వాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే మండల మహిళా సమాఖ్యలు, మెప్మా కార్యాలయాలకు ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.
ఈ పథకానికి అర్హత కల మహిళలు లబ్ధి పొందడం ఎలా?
– పెళ్లి చేసుకునే ముహుర్తానికి 15 రోజుల ముందే దరఖాస్తు చేసుకోవాలి.
-వధువు, వరుడు ఇద్దరూ ప్రజాసాధికార సర్వేలో నమోదై ఉండాలి.
– ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసించే వ్యక్తులై ఉండాలి.
– వివాహం ఆంధ్రప్రదేశ్ లోనే చేసుకోవాలి.
-ఇద్దరికీ ఆధార్‌కార్డు ఉండాలి, వధువుకు తప్పనిసరిగా తెల్ల రేషన్‌కార్డు ఉండాలి.
-వధువు బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం అవసరం.
– పెళ్లి రోజు నాటికి వధువుకు 18, వరుడికి 21 ఏళ్లు నిండి ఉండాలి.
– మొదటిసారి పెళ్లి చేసుకునే వారు మాత్రమే పథకానికి అర్హులు.
– వరుడు ఇతర రాష్ట్రానికి చెందినా వధువు ఏపీకి చెందితే పథకానికి అర్హులే.
అప్లై చేసుకోండి ఇలా:
మండల కేంద్రాల్లోని వెలుగు కార్యాలయాల్లో పెళ్లి కానుక దరఖాస్తును నమోదు చేస్తారు. నమోదుచేసిన వెంటనే అప్లికేషన్ ఐడీ నంబర్ అభ్యర్థుల మొబైల్ నంబర్‌కు వస్తుంది. అనంతరం కళ్యాణమిత్రలు వచ్చి వివరాలు సేకరించి, దర్యాప్తు చేసి, పెళ్లికి ముందుగానే మొత్తం నగదులో 20శాతం నగదును పెళ్లి కూతురు బ్యాంకు ఖాతా వేస్తారు.
తప్పనిసరిగా ఉండాల్సిన సర్టిఫికేట్లు:
-మీసేవా జారీ చేసిన నేటివిటి, కమ్యూనిటీ, బర్త్ సర్టిఫికేట్
-వయస్సు నిర్ధారణ కోసం 10 తరగతి లేదా ఇంటిగ్రేటెడ్ మీ-సేవా సర్టిఫికెట్
-కుల ధ్రువీకరణ పత్రం, వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
-తెల్లరేషన్ కార్డు లేదా మీ సేవ ఆదాయ ధ్రువీకరణ పత్రం
-పెళ్లికూతురు బ్యాంకు ఖాతా జిరాక్స్
-దివ్యాంగులైతే అందుకు సంబంధించిన సర్టిఫికెట్ (కనీసం 40 శాతంగా ఉండి శాశ్వత అంగవైకల్యం ఉండాలి)
-భవన నిర్మాణ కార్మికులైతే కార్మిక శాఖ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా గుర్తింపు కార్డు
లబ్ధి వివరాలు:
కేటగిరి | టీడీపీ ప్రభుత్వం | వైసీపీ ప్రభుత్వం |
ఎస్సీ | రూ. 40 వేలు | రూ.లక్ష |
ఎస్టీ | రూ. 50 వేలు | రూ.లక్ష |
బీసీ | రూ. 35 వేలు | రూ.లక్ష |
మైనార్టీలు | రూ. 50 వేలు | రూ.లక్ష |
భవన నిర్మాణ కార్మికులకు | రూ. 20వేలు | రూ. 20వేలు |
ఎస్సీ కులాంతర వివాహం | రూ. 75 వేలు | రూ. లక్ష |
ఎస్టీ కులాంతర వివాహం | రూ. 50 వేలు | రూ. లక్ష |
బీసీ కులాంతర వివాహం | రూ. 50 వేలు | రూ.50 వేలు |
దివ్యాంగులకు | రూ. లక్ష | రూ. లక్ష |