జనసేనకు మాజీ ఎమ్మెల్యే రాజీనామా: జగన్ సమక్షంలో వైసీపీలోకి

ఎన్నికల తర్వాత జనసేన పార్టీకి ఒక్కొక్కరుగా దూరం అవుతున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా రాజమండ్రి పార్లమెంటరీ నేత ఆకుల సత్యనారాయణ జనసేన పార్టీకి రాజీనామా చేశారు. సతీమణి పద్మావతితో కలిసి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో జగన్‌ను కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు.
ఉభయ గోదావరి జిల్లాల్లో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టిన జగన్.. కాపు సామాజిక వర్గ నేతలకు పార్టీలో డోర్లు తెరిచారు. ఇటీవలే తోట త్రిమూర్తులు కూడా పార్టీలో చేరగా ఆకుల చేరికతో బలం పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ.. జగన్ ఆలోచనలు నచ్చి పార్టీలో చేరానన్నారు. హామీల అమలుకు సీఎం శ్రీకారం చుట్టారని, మద్యపానం నిషేధం దిశగా కదులుతున్నారని చెప్పారు.
2014ఎన్నికల సమయంలో బీజేపీ తరపున ఎమ్యెల్యేగా గెలిచిన రాజమండ్రి మాజీ ఎమ్యెల్యే ఆకుల సత్యనారాయణ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జనసేనలో చేరారు. రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి జనసేన తరపున పోటీ చేశారు. ఆర్ధికంగా బలమైన ఆకుల సత్యనారాయణ తన పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల అభ్యర్థులకు సరైన సహకారం అందించలేదనే ఆరోపణలు వినిపించాయి.
ఎన్నికల తర్వాత పార్టీకి దూరంగా ఉన్న ఆకుల చివరకు వైసీపీలో చేరారు. బీజేపీలోని ఎమ్యెల్సీ సోము వీర్రాజుకు ఆకులకు రాజకీయ విభేదాలు ఉండడంతో ఆయన వైసీపీలోనే చేరారు. ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు రావెల కిషోర్ బాబు, ఆకుల సత్యనారాయణ ఇద్దరు పార్టీని వదిలిపోవడంతో జనసేనకు గట్టి ఎదురుదెబ్బే తగిలినట్లుగా తెలుస్తుంది.