APSRTCలో సంబరాలు : ఆర్టీసి ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 60 ఏళ్ళకు పెంపు

సీఎం జగన్ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కొత్త ఇసుక విధానంతో సహా పలు నిర్ణయాలకు మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించేందుకు అంగీకారం తెలిపింది. ప్రజా రవాణా శాఖ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 58 ఏళ్ళు నుంచి 60 ఏళ్లకు పెంచింది. దీంతో ఆర్టీసీలోని 53వేల మంది ఉద్యోగులకు లబ్ది చేకూరుతుంది.
ప్రభుత్వం ప్రకటించిన కొత్త ఇసుక విధానం రేపటి నుంచి అమల్లోకి రానుంది. ఇసుక ధరను టన్ను ధర 375 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో 58 ఇసుక స్టాక్‌పాయింట్లు అందుబాటులోకి రానున్నాయి. ఏపీఎండీపీ ద్వారా ఆన్‌లైన్‌లో ఇసుక బుక్ చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. రాజకీయ ప్రమేయం లేకుండా ఇసుక రీచ్‌లను నిర్వహించాలని సీఎం జగన్ సూచించారు. దశల వారీగా ఇసుక రీచ్‌లు, స్టాక్ పాయింట్లు పెంచాలని కేబినెట్ నిర్ణయించింది.
నవయుగ సంస్థకు పోలవరం హైడ్రల్ ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రివర్స్‌టెండరింగ్ పద్ధతిలో తాజా టెండర్లకు పచ్చజెండా ఊపింది. కాంట్రాక్టర్‌కు ఇచ్చిన అడ్వాన్స్‌ల రికవరీకి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఆశావర్కర్ల వేతనం పెంపునకు ఆమోద ముద్రవేసింది. ఆశావర్కర్ల వేతనాన్ని రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు.. 38 అంశాల అజెండాతో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది.