ఏపీ కేబినెట్ భేటీ : కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

ఏపీ కేబినెట్ బుధవారం (అక్టోబర్ 16, 2019) సమావేశం కానుంది. రైతు భరోసా పథకానికి శ్రీకారం చుట్టిన మరునాడే జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది మంత్రివర్గం.

  • Published By: veegamteam ,Published On : October 16, 2019 / 02:48 AM IST
ఏపీ కేబినెట్ భేటీ : కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

Updated On : October 16, 2019 / 2:48 AM IST

ఏపీ కేబినెట్ బుధవారం (అక్టోబర్ 16, 2019) సమావేశం కానుంది. రైతు భరోసా పథకానికి శ్రీకారం చుట్టిన మరునాడే జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది మంత్రివర్గం.

ఏపీ కేబినెట్ బుధవారం (అక్టోబర్ 16, 2019) సమావేశం కానుంది. రైతు భరోసా పథకానికి శ్రీకారం చుట్టిన మరునాడే జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది మంత్రివర్గం. రాష్ట్ర ప్రజలకు మరిన్ని వరాలు అందించేందుకు పలు పథకాలకు ఆమోదముద్ర వేయనుంది. 

ఏపీ సచివాలయంలో ఉదయం 11.30గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. దాదాపు నెలరోజుల విరామం తర్వాత భేటీ అవుతున్న కేబినెట్ మీటింగ్‌లో ప్రధానంగా 15 అంశాలు చర్చకు రానున్నాయి. మరిన్ని కొత్త పథకాలకు, కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. ముఖ్యంగా… మహిళల ఆర్థికాభివృద్ధి కోసం గత ప్రభుత్వం ప్రారంభించిన వెలుగు పథకాన్ని..వైఎస్సార్ క్రాంతి పథకంగా మార్చి అమలు చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వనుంది. వైఎస్సార్ రైతు భరోసా కింద రైతులకు పెంచిన వెయ్యి రూపాయల పెట్టుబడి సాయానికి కూడా మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. 

చేనేత కుటుంబాలకు 24 వేల రూపాయల ఆర్థిక సాయం చేయాలన్న జగన్ నిర్ణయానికి కూడా కేబినెట్‌ ఓకే చెప్పనుంది. అయితే ఈ పథకం అమలు తీరుపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. ఒకేవిడతలో మొత్తం డబ్బు ఇవ్వాలా?  లేదంటే.. నెలకు రెండు వేల రూపాయల చొప్పున అందివ్వాలా? అన్నదానిపై నిర్ణయం తీసుకోనుంది. అలాగే గత కేబినెట్‌లో చర్చకురాని మత్స్యకారుల సంక్షేమం విషయంలోను నిర్ణయం తీసుకోనుంది. చేపల వేట నిషేధం సమయంలో మత్స్యకారులకు అందిస్తున్న 4వేల రూపాయల సాయాన్ని 10వేలకు పెంచే అవకాశం ఉంది.  నాయిబ్రాహ్మణులకు ఏడాదికి 10వేల రూపాయల సాయంపైన చర్చించే అవకాశం ఉంది.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం ప్రత్యేకంగా ఔట్ సోర్సింగ్ కార్పోరేషన్ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. వ్యవసాయ కమిషన్ సమావేశంలో మిల్లెట్, పల్సెస్, ప్యాడీ బోర్డులను ఏర్పాటు అంశం కూడా కేబినెట్‌ భేటీలో టేబుల్ అజెండాగా చర్చకు రానుంది. రాష్ట్రంలో ఇసుక కొరత క్రమంలో ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. 

పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుదలకు మన బడి నాడు-నేడు పేరుతో ప్రత్యేకంగా ఓ పథకాన్ని రూపొందించాలని సీఎం నిర్ణయించారు. దీనిపై కేబినెట్‌లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. ఈ పథకాన్ని నవంబర్ 14 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్న ప్రభుత్వం… సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా రిజర్వేషన్లను 50శాతానికి కుదించడంపై చర్చించనుంది. అలాగే వివాదంగా మారిన రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం పనుల రివర్స్ టెండరింగ్, పీపీఏల వంటి అంశాలపై చర్చ జరిపే అవకాశం ఉంది. 

ఆర్టీసీ ఉద్యోగుల విలీనం కోసం ఇప్పటికే కమిటీని వేసిన ప్రభుత్వం.. తదుపరి ప్రక్రియపై దృష్టి పెట్టనుంది. ఆరోగ్య శాఖ సంస్కరణలపై సుజాతారావు కమిటీ ఇచ్చిన నివేదికకు ఆమోదం తెలిపే అవకాశముంది. మరోవైపు.. పెండింగులో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు, హెచ్‌పీసీఎల్‌ గ్యాస్ పైప్‌లైన్ కోసం భూ కేటాయింపులు జరిపే ఛాన్సుంది.