పోలీసుల తీరుకు నిరసనగా అమరావతి బంద్

ఏపీ రాజధాని అమరావతిలో శనివారం బంద్ పాటిస్తున్నారు. గ్రామస్తులపై పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ అమరావతి జేఏసీ ఫిబ్రవరి 22న బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో 29 గ్రామాల రైతులు బంద్ నిర్వహిస్తున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ బంద్‌లో పాల్గొనాలని రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల ప్రజలను జేఏసీ కోరింది. అంతేకాదు.. విద్యా, వ్యాపార సంస్థలు స్వచ్ఛంగా బంద్ పాటించాలని విజ్ఞప్తి చేసింది. రాజధాని ప్రాంతంలోని ప్రతి ఒక్కరూ బంద్‌కు సహకరించాలని కోరింది.
రాజధాని ప్రాంతంలోని రైతులు, పోలీసుల మధ్య వివాదం నడుస్తోంది. రాజధానిలో సర్వే కోసం వచ్చిన లేడీ తహసీల్దార్‌ను అడ్డుకున్నారంటూ… పోలీసులు 426 మంది రైతులపై కేసు నమోదు చేయడం వివాదానికి కారణమైంది. పోలీసుల తీరును నిరసిస్తూ గురువారం రైతులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు డ్రోన్ కెమెరాతో ఆడవాళ్లు స్నానాలు చేస్తుండగా చిత్రీకరించారని రైతులు ఓ కానిస్టేబుల్‌పై దాడి చేశారు. డ్రోన్ కెమెరాలను లాక్కొన్నారు. కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డారంటూ ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో తమపై బనాయించిన కేసులను ఎత్తివేయాలంటూ ఆందోళనకు దిగారు.
శుక్రవారం కూడా మందడంలో రైతులు ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. పోలీసుల తీరును నిరసిస్తూ రైతులు పలుచోట్ల నిరసనలు తెలిపారు.మరోవైపు మందడంలో రైతులకు, పోలీసులు నెలకొన్న వివాదం నేపథ్యంలో.. అమరావతి పరిరక్షణ సమితి సమావేశమైంది. పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ బంద్ పాటించాలని నిర్ణయించింది. 29 గ్రామాల బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో ఇవాళ అమరావతి ప్రాంతంలో బంద్ జరుగుతోంది.
Read More>>చంద్రబాబు నియోజకవర్గంలో వైసీపీ సీనియర్ నేత హత్యకు కుట్ర