ఈసీపై బాబు పోరు : ఢిల్లీ వేదికగా ఉద్యమం

AP రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ముగియడంతో TDP అధినేత చంద్రబాబు తదుపరి కార్యాచరణకు సిద్ధమయ్యారు. ఈసీ ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకించడంతో పాటు EVMలు, VVPATల వ్యవహారంపై ఢిల్లీలో ఉద్యమించనున్నారు. ముఖ్యమంత్రితో పాటు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులు, సిట్టింగ్ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, రాష్ట్ర మంత్రులంతా ఏప్రిల్ 13వ తేదీ శనివారం ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సీఈసీని చంద్రబాబు బృందం కలువనుంది. ఏపీలో పోలింగ్ జరిగిన తీరు, ఈవీఎంల ఇబ్బందులపై ఆయన కంప్లయింట్ చేయనున్నారు.
వీవీ ప్యాట్‌ల లెక్కింపుపై టీడీపీ సుప్రీంకోర్టులో రివిజన్ పిటిషన్ కూడా వేయనుంది. ప్రజల సహనానికి ఎన్నికల సంఘం అగ్నిపరీక్ష పెట్టిందని చంద్రబాబు తన ఆగ్రహాన్ని వ్యక్తం చేయనున్నారు. ఎన్నికల్లో ఈవీఎంలు పనిచేయకపోవడం, మొరాయించడం, పార్టీల గుర్తు మారడం, సైకిల్ గుర్తుకు ఓటేస్తే ఇతర గుర్తులకు పడడంపై ఆయన ఎండగట్టనున్నారు. స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదనే విషయాన్ని స్పష్టం చేయడంతో పాటు పరిస్థితిని ముందే ఊహించి బ్యాలెట్ పేపరు పెట్టాలని అనేకసార్లు అడిగినా ఈసీ మొండి వైఖరి అవలంభించడాన్ని ఆయన తప్పుపట్టనున్నారు.
EVMల మొరాయింపు సమయంలో వాటిని సరిచేసేందుకు వచ్చిన సాంకేతిక నిపుణులు ఎవరు? వారికి ఉన్న అర్హతలేమిటనే దానిపై ఈసీని చంద్రబాబు నిలదీయనున్నారు. వారిని ఎలా నియమించారని ప్రశ్నించనున్నారు. ఈవీఎంల పని తీరుపై దేశ స్థాయిలో పోరాడేందుకు బాబు వ్యూహ రచన చేస్తున్నారు.