YSR ఆరోగ్య ధీమా: ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీకి సీఎం జగన్ శ్రీకారం..క్యాన్సర్‌కు పూర్తి చికిత్స

  • Published By: veegamteam ,Published On : January 3, 2020 / 07:11 AM IST
YSR ఆరోగ్య ధీమా: ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీకి సీఎం జగన్ శ్రీకారం..క్యాన్సర్‌కు పూర్తి చికిత్స

Updated On : January 3, 2020 / 7:11 AM IST

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పైలెట్ ప్రాజెక్టు కింద సీఎం జగన్ వైఎస్‌ఆర్ ఆరోగ్య శ్రీ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని ఏలూరు ఇండోర్‌ స్టేడియంలో  శుక్రవారం (జనవరి 3) ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ఆరోగ్యశ్రీ లబ్ధిదారులతో సీఎం జగన్ మాట్లాడారు.  కాగా ఆరోగ్య శ్రీ పథకంలో ప్రస్తుతం 1,059 వ్యాధులకు చికిత్స అందిస్తుండగా.. అదనంగా మరో 1000 చేర్చి మొత్తం 2,059 వ్యాధులకు సేవలందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.2020  ఏప్రిల్‌ నుంచి ప్రతి నెలా ఒక్కో జిల్లాలో 2,059 రోగాలకు ఈ పథకాన్ని విస్తరిస్తూ వెళతారు. అప్పటి నుంచే ఆయా జిల్లాల్లో.. చికిత్స వ్యయం రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తించడం ప్రారంభమవుతుంది. అన్ని రకాల క్యాన్సర్లకూ ఈ పథకం వర్తించనుంది. ఈ పథకం ద్వారా క్యాన్సర్ కు పూర్తి చికిత్స అందించబడుతుంది. వైఎస్ ఆర్ ఆరోగ్య శ్రీ పథకం పరిధిలోకి రాష్ట్రంలోని 1.42 కోట్ల కుటుంబాలు లబ్ది పొందనున్నాయి.   

ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ..వైఎస్ ఆర్ ఆరోగ్య శ్రీ కార్డు పంపిణీ తొలి రోజునే 1.5 లక్షల కార్డులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు.  గతంలో పలు ఒడిదుడుకుల మధ్య 1059 వ్యాధులకు చికిత్స అందేదని దాన్ని మరింతగా పెంచుతు 2059 వ్యాధులకు పెంచామని తెలిపారు. ఈ పథకం ద్వారా చికిత్స చేయించుకునీ లేదా ఆపరేషన్ చేయించుకున్నవారు విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా రోగికి నెలకు రూ.5వేలు అందిస్తామని తెలిపారు.ముఖ్యంగా క్యాన్సర్ రోగులకు పూర్తి చికిత్సనందించే సౌకర్యాన్ని ప్రవేశపెట్టామని వెల్లడించారు సీఎం జగన్. 
ఆరోగ్య శ్రీ కార్డులో క్యూఆర్ కోడ్స్ 
సంవత్సరానికి రూ.5లక్షల ఆదాయం ఉన్న కుటుంబాలు..నెలకు రూ.40వేల జీతం తీసుకునవారికి కూడా ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు.  ఆరోగ్య శ్రీ కార్డులకు క్యూఆర్ కోడ్ లను కూడా ప్రవేశపెట్టామని దీంతో మరింత సౌలభ్యంగా ఉంటుందని అన్నారు.  ఈ క్యూఆర్ కోడ్ తో గతంలో ఎక్కడైనా రోగి చికిత్స చేయించుకున్నా..ఎటువంటి టెస్ట్ లు చేయించుకున్నా..అది వెంటనే తెలుస్తుందనీ..వెతుక్కోవాల్సిన పనిలేకుండా సౌలభ్యంగా ఉంటుందని మొత్తం మెడికల్ రికార్డులన్నీ కూడా ఈ కార్డులో ఉండే క్యూఆర్ కోడ్ వల్ల తెలుస్తుందని సీఎం తెలిపారు.

బాధితులకు అండగా ఆశావర్కర్లు 
కొత్తగా పంపిణీ చేసే ఈ వైఎస్ ఆర్ ఆరోగ్య శ్రీ కార్డులను గ్రామ పంచాయితీ కార్యాలయంలో అందజేస్తామనీ..లబ్దిదారులంతా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సీఎం కోరారు. గ్రామంలో ఎవరైనా రోగులు ఉంటే వారికి సహాయంగా ఏ హాస్పిటల్ కు వెళ్లాలి? ఏ వ్యాధికి ఏ ప్రాంతంలో ఉన్న హాస్పిటల్ లో చికిత్సనందించే సదుపాయం ఉంది అనే విషయంలో ఆశా వర్కర్లు, గ్రామ వాలంటీర్లు సహాయంగా ఉంటారని తెలిపారు. ప్రతీ మూడు వందల ఇళ్లకు ఆశావర్కర్లు సేవలందిస్తారని..వారి ఆరోగ్య బాధ్యతల్ని ఆశావర్కర్లు చూసుకుంటారన్నారు. త్వరలోనే 1060 అంబులెన్స్ లను అందుబాటులోకి తీసుకొస్తామనీ ఈ సందర్భంగా సీఎం జగన్ వెల్లడించారు.